జగ్రాన్ చలనచిత్రోత్సవం ప్రారంభం
జగ్రాన్ చలనచిత్రోత్సవం ప్రారంభం
Published Thu, Sep 26 2013 2:04 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: అంతర్జాతీయ చిత్రోత్సవం జగ్రాన్ నగరంలోని అంధేరీలో బుధవారం ప్రారంభమైంది. తొలి సినిమాగా ఇజ్రాయిల్-పాలస్తీనా చిత్ర నిర్మాత రూపొందించిన ‘వాటర్’ను ప్రదర్శించారు. అంధేరీలోని ఫన్ రిపబ్లిక్ సినిమా హాలులో నటుడు అక్షయ్‌కుమార్, నటి నిమ్రత్‌కౌర్ (లంచ్‌బాక్స్ ఫేం)లు జ్యోతి వెలిగించి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ చలన చిత్రోత్సవం ఆరు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
తొలి రోజు వాటర్‌తో పాటు హకో చెకో టర్కిష్ చిత్రం ‘నో వేర్ లి వీర్’, సంజయ్‌జాదవ్ చిత్రం ‘ధునియాదరి’, కుందన్‌షా చిత్రం జానే బీ దో యారోలను ప్రదర్శించారు. ఉత్సవాన్ని ప్రారంభించిన అక్షయ్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘చలన చిత్ర పరిశ్రమ ఆదరించి అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చలన చిత్రోత్సవాలకు హాజరైన సందర్భంగా అన్ని రకాల చిత్రాలను చూడడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచ సినిమా రీతులను తెలుసుకోవడానికి ఇష్టపడతాను’’ అని తెలిపాడు. నిమ్రత్‌కౌర్ మాట్లాడుతూ ‘‘తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందించాను.
ఇందులో మిధున్ చక్రవర్తిగారితో నేను నటించాను. ఇందులో నేను నటించిన హర్యాన్వీ పాత్ర ఇప్పటి వరకు హిందీ చలన చిత్రాల్లో ఎవరూ చేయలేదు. ఇది చిన్న చిత్రమైనా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపింది. నమ్రత చిత్రం భారతదేశం తరఫున పోటీలో ఉంటుందని ఆశించినా.. గుజరాత్‌కు చెందిన ‘ది గుడ్ రోడ్’ ఎంపికైంది. ఈ చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖులు అనిల్ శర్మ, సుధీర్ మిశ్రా, సునీల్ ప్రభు ముంబై మేయర్ తదితరులు హాజరయ్యారు.
Advertisement