
షూటింగ్‌లో లేని నటిని కోప్పడేదెట్టాగబ్బా?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం గురించి ఇటీవల ఓ వార్త హల్‌చల్ చేసింది. ఆ చిత్ర షూటింగ్‌లో పాత్రకు తగ్గట్టుగా మేకప్ చేసుకోలేదంటూ నటి ప్రణీతను దర్శకుడు గట్టిగా అరిచారనీ, దాంతో ఆమె ఆ చిత్రం నుంచి వైదొలగిందనీ ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన గాసిప్ సంచలనమైంది. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ కథానాయికల్లో ఒకరైన ప్రణీత ఈ తాజా అల్లు అర్జున్ సినిమాలోనూ నటిస్తుందంటూ చాలా కాలంగా అనధికారిక వార్తలు షికార్లు చేస్తూ వచ్చాయి.
కానీ, అవన్నీ వట్టి గాలివార్తలేనన్నది సినిమా తారాగణం గురించి ఆ మధ్య అధికారిక ప్రకటన వెలువడినప్పుడు తేలిపోయింది. ఇంతలో ఈ సినిమా గురించి ఈ తాజా పుకారు వచ్చింది. ఈ విషయం గురించి స్పష్టత కోసం ‘సాక్షి’ ప్రయత్నించింది. ‘‘మా సినిమాలో పాత్ర కోసం ప్రణీతను అనుకోవడం కానీ, సంప్రదించడం కానీ అసలు జరగనే లేదు. అలాంటిది... సినిమాలోనే లేని నటి వచ్చి, షూటింగ్‌లో పాల్గొన్నట్లు రాయడం వారి కల్పనాశక్తికి పరాకాష్ఠ. షూటింగ్‌లో కాదు కదా, అసలు సినిమాలోనే లేని నటిని సెట్స్‌పై ఎవరైనా ఎలా కోప్పడతారు?’’ అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
వాస్తవానికి, ఇప్పటి దాకా 15 రోజులు ఈ చిత్ర షూటింగ్ జరిగింది. అదీ - హైదరాబాద్, పరిసరాల్లోనే! అందులో హీరో అల్లు అర్జున్, సమంత, ఆదాశర్మ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ బృందం పాల్గొన్నారు. అసలు లేని ప్రణీత ఉన్నట్లూ, అలిగి షూటింగ్‌లో నుంచి వెళ్ళిపోయినట్లూ పత్రికల్లో రావడం సహజంగానే చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి వారిని సంప్రదిస్తున్నారని కూడా అనధికారిక వార్తలు షికారు చేస్తున్నాయి. దీని గురించి చిత్ర వర్గాలు వివరణనిస్తూ, ‘‘గతంలో ‘జులాయి’ చిత్రానికి కూడా టైటిల్ ప్రకటించక ముందే ‘హనీ’, ‘పార్క్’ లాంటి పేర్లు, ‘అత్తారింటికి దారేది’కి ‘సరదా’ లాంటి పేర్లు ఎవరెవరో ప్రచారంలో పెట్టారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. టైటిల్, ముఖ్య తారాగణం వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నాయి. మొత్తానికి, గాలివార్తల పుణ్యమా అని అల్లు అర్జున్ - త్రివిక్రమ్ చిత్రానికి కావలసినంత ఉచిత ప్రచారం జరుగుతోంది.