అవార్డు స్వీకరిస్తున్న ట్వింకిల్ ఖన్నా
ముంబై : రచయిత్రిగా దూసుకుపోతున్న బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఫిక్కి మహిళా సమాఖ్య ఐకాన్ అవార్డు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగి ఉన్న ట్వింకిల్ ఖన్నా సినిమా రంగానికి చేస్తున్న కృషికి గానూ ఆమెకు అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విఙ్ఞాన్ భవన్‌లో గురువారం జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్వింకిల్‌తో పాటు వివిధ రంగాలలో కృషి చేసిన పది మంది మహిళామణులు అవార్డులు అందుకున్నారు. రుతుక్రమం గురించి మహిళల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, పాటించాల్సిన శుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు తెరకెక్కించిన ‘పాడ్‌మాన్’ సినిమాకు ట్వింకిల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మిసెస్ ఫన్నీ బోన్స్’, ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ’ అనే పుస్తకాలు రచించారు.
ఈ సందర్భంగా ట్వింకిల్ మాట్లాడుతూ.. ‘మహిళలు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడం కంటే ఎవరో ఒకరి వెనుక ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే అసలు సమస్య. ఇప్పటికైనా ఇలాంటి దృక్పథాన్ని వదిలి మన జీవితాల్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ’ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ట్వింకిల్.. ‘ఒక్కోసారి నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నానా అనే అనుమానం కలుగుతుంది. ఒత్తిడి కారణంగానే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment