ఆస్కార్ రేసు భారత చిత్రాల ఎంపిక జ్యూరీలో ఇద్దరు తెలుగు దర్శకులు
టాలీవుడ్కు సమున్నత గౌరవం దక్కింది. ఈసారి ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ రేసులోకి వెళ్లే చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీలోకి ఇద్దరు తెలుగు దర్శకులను తీసుకున్నారు. మొత్తం 12 మంది సభ్యులుండే ఈ జ్యూరీలో ఎన్.శంకర్, సి.వి. రెడ్డి సభ్యులుగా ఉండబోతున్నారు. ''ఇది మాకు చాలా గౌరవం. నామినేషన్ కోసం వచ్చే సినిమాలన్నింటినీ చూసి ఆనందించాలని నేను చాలాకాలం నుంచి అనుకుంటున్నా'' అని ఎన్. శంకర్ తెలిపారు. జైబోలో తెలంగాణ, జయం మనదేరా లాంటి చిత్రాలతో ఆయన ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు స్క్రీనింగ్ కోసం 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిని ఈనెల 17 నుంచి 22 వరకు ప్రదర్శిస్తారు. ఈసారి రెండు తెలుగు సినిమాలు 'మిథునం', 'శ్రీ జగద్గురు ఆది శంకర' కూడా నామినేషన్లు పొందిన విషయం తెలిసిందే. గతంలో 'పెళ్లిగోల', 'అమ్మా నాన్న కావాలి', 'మధుమతి' లాంటి చిత్రాలు తీసిన సీనియర్ దర్శకుడు సి.వి.రెడ్డి కూడా ఈ జ్యూరీలో సభ్యునిగా ఎంపికయ్యాఉ. ఆయన గతంలోనూ ఇండియన్ పనోరమా విభాగంలో సభ్యునిగా ఉన్నారు.