సంతానంకు జంటగా వైభవి శాండిల్య
హాస్య నటుడి నుంచి కథానాయకుడి స్థాయికి ఎదిగిన నటుడు సంతానం. ఇప్పటి తన స్థాయిని నిలబెట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఈయన చిత్రాల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సంతానం దిల్లుక్కు దుడ్డు, సర్వర్ సుందరం చిత్రాల్లో నటిస్తున్నారు. దిల్లుక్కుదుడ్డు చిత్రంలో తన ఆస్థాన హీరోయిన్‌గా ప్రచారంలో ఉన్న ఆస్నా జవేరి నటిస్తుండగా, సర్వర్‌సందరం చిత్రంలో మరాఠి బ్యూటీ వైభవి శాండిల్యను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కెనన్యా ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవి శాండిల్యను ఎంపిక చేయడం గురించి చిత్రం యూనిట్ పేర్కొంటూ మహారాష్ట్ర కోలీవుడ్‌కు చాలా మంది ప్రతిభావంతుల్ని అందించిందన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి తాజాగా పరిచయం అవుతున్న వైభవి శాండిల్య కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. మూడు నెలల అన్వేషణ ఫలం వైభవి శాండిల్య అని అన్నారు. ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు మంచే జరిగిందన్నారు. వైభవి సౌందర్యవతి మాత్రమే కాకుండా మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని తెలిపారు. అంతేకాదు భరతనాట్యం, కథాకళి నృత్యాల్లో నైపుణ్యం పొందిన నటి అని చెప్పారు.అలాంటి నటిని సర్వర్ సుందరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామన్నారు. వైభవి శాండిల్యకు ఇక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.