
లక్ష్య, వినయ్ వర్మ, సాహితి, నీరజ్ ప్రధాన పాత్రల్లో అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్’. ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ నిర్మించారు. శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి సహనిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమా సెట్‌లో విడుదల చేశారు. అనంతరం వంశీ మాట్లాడుతూ– ‘‘టైటిల్ నాకు బాగా నచ్చింది. బాయ్ స్టేజ్‌లో ప్రతి ఒక్కరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. హైస్కూల్ యూనిఫామ్‌లో ఉన్న స్టూడెంట్ కాలేజ్ వైపు చూస్తూ ఉన్న ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి.
అమర్‌కి సినిమా అంటే ప్యాషన్. పోస్టర్ విషయంలోనే ఇంత శ్రద్ధ తీసుకుంటే సినిమా ఇంకా బాగా తీసి ఉంటారని అర్థం అవుతుంది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా చూడాలని ఉంది. టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు. ఇక మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే.