టేస్టీగా మసాలా రెడీ | Venkatesh, Ram multi star movie tasty 'Masala' ready | Sakshi
Sakshi News home page

టేస్టీగా మసాలా రెడీ

Published Wed, Oct 23 2013 1:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

Venkatesh, Ram multi star movie tasty 'Masala' ready

వెంకటేష్, దర్శకుడు కె.విజయభాస్కర్ ఇద్దరూ నవ్వించడంలో సిద్దహస్తులే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో అలరించాయి. ముచ్చటగా మూడో సారి వీరిద్దరూ కలిసి పనిచేయడం ఓ విశేషం అయితే, వీరితో పాటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా తోడవ్వడం మరో విశేషం. ఈ ముగ్గురు కలిసి నూరే మల్టీస్టారర్ ‘మసాలా’ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా! అంజలి హొయలు... షాజన్ పదమ్‌సీ తళుకులు ఈ ‘మసాలా’కు అదనపు ఆకర్షణలు. ఇటీవలే వెంకటేష్, రామ్, కోవై సరళ, జయప్రకాష్‌రెడ్డి, అలీపై చిత్రీకరించిన మసాలా రీమిక్స్ సాంగ్‌తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
 
నిర్మాత ‘స్రవంతి’రవికిషోర్ వచ్చే నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘వెంకటేష్ ఇందులో దాదాగా నటిస్తున్నారు. ఆయన పాత్ర తీరు తెన్నులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఆహార్యంలోనూ, వాచకంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకొని వెంకటేష్ ఈ పాత్ర పోషించారు. అభిమానులనే కాక, ప్రతి ఒక్కరినీ ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. రామ్ పాత్ర కొత్తగా ఉంటుంది. అతని పాత్రలో భిన్న కోణాలుంటాయి. నటునిగా రామ్‌ని మరో మెట్టుపై నిలబెట్టే సినిమా అవుతుంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవలే విడుదల చేశాం.
 
మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా తప్పకుండా అందరినీ అలరిస్తుందని నా నమ్మకం’’ అని ‘స్రవంతి’ రవికిషోర్ అన్నారు.  పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిదని, రెండున్నర గంటల పాటు చక్కని టైమ్‌పాస్ అని దర్శకుడు విజయభాస్కర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: రోహిత్‌శెట్టి, ఛాయాగ్రహణం: ఆండ్రూ, కళ: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement