కేటీఆర్‌.. నేను బెంచ్‌మేట్స్‌ | Vinaya Vidheya Rama Pre Release Function | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌.. నేను బెంచ్‌మేట్స్‌

Published Fri, Dec 28 2018 2:17 AM | Last Updated on Fri, Dec 28 2018 8:08 AM

Vinaya Vidheya Rama Pre Release Function - Sakshi

‘‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి వచ్చి ఆశీస్సులు అందించిన కళాభిమానులకు, మా మెగా అభిమానులకు కృతజ్ఞతలు. నేను అనుకున్న దానికంటే ఈ వేదిక చాలా వైబ్రంట్‌గా ఉందంటే దానికి ప్రధాన కారణం మీ రాక, మీ కేకలు, కేరింతలు. ఈ ఉత్సాహమే ఎప్పుడూ మేము కోరుకుంటాం’’ అని చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై దానయ్య డీవీవీ  నిర్మించిన ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో....

చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం మీ ఉత్సాహం, ప్రోత్సాహమే. ఎవరైనా నన్ను ఏం సాధించావు? ఏం ఆర్జించావు? అని అడిగితే.. ఒకటి రామ్‌చరణ్, రెండోది కోట్లాదిమంది అభిమానులు అని చెప్పగలను. మనం నిజంగా కోట్లు గడించొచ్చు. కానీ, ఎంతకాలం మనవద్ద ఉంటాయో తెలియదు. కానీ, ఎప్పటికీ తరగనిది మీ అభిమానం అని గుండె లోతుల్లోంచి చెబుతున్నా. రాజకీయంగా కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ తిరిగొచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందా? అనే మీమాంస ఉండేది. ‘ఖైదీ నంబర్‌ 150’ని సూపర్‌ డూపర్‌ హిట్‌ చేసి, మీ అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని నిరూపించారు. కేటీఆర్‌గారి రాకతో ఈ ఫంక్షన్‌కి నిండుదనం వచ్చింది.

మేమిద్దరం ఒకే బెంచ్‌మేట్స్‌.. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉంది ఏ స్కూల్‌లో, ఏ కాలేజ్‌లో అని అడగొద్దు.. అసెంబ్లీలో మేమిద్దరం ఒకే టైమ్‌లో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ‘రంగస్థలం’ షూటింగ్‌ అప్పుడు నెక్ట్స్‌ సినిమా ఏం చేస్తే బాగుంటుందని నాకు, రామ్‌చరణ్‌కి మధ్య చర్చ జరిగింది. ‘గోవిందుడు అందరివాడేలే’లో ఫ్యామిలీ డ్రామా చేశావ్, ‘ధృవ’ చిత్రంలో మోడ్రన్‌ కాప్‌గా చేశావ్‌. ఇప్పుడేమో గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ చేస్తున్నావ్‌. ఇక మిస్‌ అవుతున్నది ఏదైనా ఉందంటే అది మాస్‌. ప్రేక్షకుల్ని అలరించేలా, మన ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చేలా మాస్‌ సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పా. ఎక్కడో ఓ లైన్‌ విన్నా.. బోయపాటి కాంబినేషన్‌ అని.

ఆయనతో సినిమా చేస్తే మాస్‌కి దగ్గరవడానికి స్కోప్‌ ఉంటుంది చేయమని చరణ్‌ని ఉసిగొల్పా. తర్వాత బోయపాటిగారు వచ్చి ‘వినయ విధేయ రామ’ కథ చెప్పారు. హీరో పాత్ర వినగానే నాకు ‘గ్యాంగ్‌లీడర్‌’లో నా పాత్ర గుర్తుకొచ్చింది. సినిమా రషెష్‌ చూశా. చెప్పింది చెప్పినట్టు తీశారు బోయపాటి. ఈ చిత్రం ట్రైలర్‌ చూసి కొన్నిసార్లు శభాష్‌ అన్న సందర్భాలున్నాయి. చరణ్‌ చేశాడు అనడం కంటే బోయపాటి చేయించాడు.. అది చరణ్‌ తెరపై చక్కగా చూపించాడు. ‘రంగస్థలం’ సినిమాకి చక్కటి పాటలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి కూడా మంచి పాటలిచ్చారు. బోయపాటికి అవసరం మేరకు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా వెన్నుదన్నుగా నిలిచారు దానయ్య. ఆయనకి విజయలక్ష్మి, ధనలక్ష్మి వరిస్తారు.

‘వినయ విధేయ రామ’ విజయం తథ్యం. దానయ్యగారు చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం ‘భరత్‌ అనే నేను’, 2019 సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’, ఆ  తర్వాతి ఏడాదికి అపజయం ఎరుగని రాజమౌళితో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేయడం ఆషా మాషీ కాదు. ఏ నిర్మాతకీ రాని గొప్ప అవకాశం ఆయనకి వచ్చింది. చాలా మంది నిర్మాతలు ‘ఏంటీ దానయ్య’ అని ఈర్ష్య పడేలా ఆయనకి అవకాశాలొస్తున్నాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నేను హీరోగా దానయ్యగారు ఓ సినిమా చేయనున్నారు. ఈ కాంబినేషన్‌ని సెట్‌ చేసింది రామ్‌చరణ్‌. దానయ్యగారితో చరణ్‌ వరుసగా రెండు సినిమాలు చేయడంతో పాటు నన్ను కూడా ఇరికించారు (నవ్వుతూ). త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్నది నా ఆకాంక్ష. మా కాంబినేషన్‌లో ఓ చక్కటి సినిమా వస్తుంది.. అది ఎప్పుడొస్తుందా అని నేను కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ– ‘‘మొత్తం తెలుగు చలన చిత్రపరిశ్రమకు... ఇంకా చెప్పాలంటే భారత చలన చిత్రపరిశ్రమలో ఒక దిగ్గజం, ఒక మహానటుడు... స్వయంకృషితో ఈ రోజు పరిశ్రమలో....ఇప్పుడే చరణ్‌ చెప్పినట్లు...సముద్రమంత అభిమానాన్ని.. అద్భుతమైన వారసులను కూడా అందించిన పెద్దలు, గౌరవనీయులు మెగాస్టార్‌ చిరంజీవిగారికి నమస్కారం. చరణ్‌ స్పీచ్‌ వింటుంటే మేము ఎలక్షన్స్‌లో స్పీచ్‌లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడాడని చెప్పవచ్చు. మా సోదరుడు చరణ్‌ ఈ మధ్య చాకచక్యంగా హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతున్నాడు. ‘ధృవ’కి కూడా నేను వచ్చాను. పెద్ద హిట్‌ సాధించింది. ‘రంగస్థలం’  సినిమా చేస్తున్నప్పుడు బయట కలిశాం. ఆ గడ్డం చూసి ఏ సినిమా చేస్తున్నావ్‌? అని అడిగా. ఇదంతా రూరల్‌ సెట్టింగు.

గ్రామీణ నేపథ్యంలో సినిమా అన్నాడు. నేను చచ్చినా చూడను ఆ సినిమా అన్నా. రిలీజ్‌ అయిన తర్వాత నా స్నేహితులు చాలా మంది చెప్పారు.. ఆ సినిమా అద్భుతంగా ఉందని. చూసిన తర్వాత చెబుతున్నాను.. అది నీ కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌. ఈ సినిమాను ఎలక్షన్స్‌లో కూడా బాగా వాడుకున్నాను నేను. ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటవా? అని నా స్పీచ్‌లో ప్రతిచోటా వాడాను. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి కూడా మంచి సంగీతం ఇచ్చాడు. ఈ జోనర్‌ సినిమాలు నేను చూడను. కానీ బోయపాటిగారి కోసం చూస్తాను. చిరంజీవిగారి నుంచి వినయాన్ని, విధేయతను, సంస్కారాన్ని.. ఇలా అన్నింటినీ అలవరుచుకుని ఇండస్ట్రీలో అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న చరణ్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. కల్యాణ్‌గారు ఇక్కడ లేరు. ఈ మధ్య రెండు మూడు సార్లు మాట్లాడాను. వారి రాజకీయ, సినీ ప్రస్థానం కూడా విజయవంతంగా ముందుకు సాగాలని  కోరుకుంటున్నాను’’ అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి విజన్‌ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న కేటీఆర్‌గారి తపన చాలా స్ఫూర్తి. ఇప్పుడు బాస్‌ అనాలా? బిగ్‌బాస్‌ అనాలా? మెగాస్టార్‌ అనాలా? లేకుంటే ముద్దుగా మీరందరూ పిలిచే అన్నయ్యా అనాలా? అది తెలీదు కానీ నాకు మాత్రం నాన్నగారే. ‘సైరా’ షెడ్యూల్‌లో బిజీగా ఉండి కూడా వచ్చినందుకు థ్యాంక్స్‌ డాడ్‌. ‘వినయ విధేయ రామ’ అనగానే బోయపాటిగారు గుర్తొస్తారు. నాలుగేళ్ల కిందట ఈ సినిమా లైన్‌ చెప్పారాయన. అందరికీ నచ్చేలా మంచి సినిమా చరణ్‌కి ఇవ్వాలనే ఇన్నేళ్లు వెయిట్‌ చేసి రాసిన కథ ‘వినయ విధేయ రామ’. ప్రతి హీరో ఆయనతో ఒక్కసారైనా పనిచేయాలన్నది నా కోరిక.

ఆయనతో పనిచేస్తే వచ్చే కిక్కే వేరప్పా. నా మాట నమ్మండి. అంతగొప్ప డైరెక్టర్, గొప్ప వ్యక్తి ఆయన. ఈ సినిమా నాకు మంచి మెమొరీగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌.. ఈ సినిమాకి నువ్వు ఎంత చాలెంజ్‌గా మ్యూజిక్‌ కొట్టావో తెలీదు కానీ మా కొరియోగ్రాఫర్లు మాత్రం మా మోకాళ్లు విరగ్గొట్టారు(నవ్వుతూ). భారీ సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ దానయ్యగారు అయిపోయారు. మా నాన్నగారి ‘ఖైదీ, గ్యాంగ్‌లీడర్‌’ వంటి కమర్శియల్‌ సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి ఒక లవ్లీ సినిమా ఇది. నాన్నగారు 1980లో ‘అభిలాష, ఖైదీ, మన్మథరాజు, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి అన్ని జోనర్స్‌ చేశారు. అలా చేయాలని మాకూ కోరిక ఉండి ఈ సినిమా ఒప్పుకున్నా’’ అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ
‘‘వారసత్యం అనేది అసమర్థుడికి బరువు.. సమర్థుడికి ఓ బాధ్యత. రాజకీయరంగంలో కేసీఆర్‌గారి వారసుడిగా కేటీఆర్‌గారు, సినిమా రంగంలో చిరంజీవి వారసుడిగా చరణ్‌బాబు ఇద్దరూ ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. చరణ్‌బాబు ఆర్టిస్టుగా ఏంటో ఈ సినిమా విడుదల తర్వాత చూస్తారు. ప్రేక్షకులందరూ గుండెమీద చేయి వేసుకుని ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement