శివకుమార్ మృతదేహం
అడ్డాకుల (దేవరకద్ర) : చెరువులో ఎక్కువ లోతుకు మట్టి తవ్వకాలు చేపట్టం వల్ల ఏర్పడిన గుంతలు ఓ బాలుడి ప్రాణం తీశాయి. ఈ సంఘటన మండలంలోని గుడిబండలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సతీష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ మేకల దాదెన్న, సరోజ దంపతులకు కుమార్తె అంజలి, కుమారుడు శివకుమార్(9) ఉన్నారు. బాలుడు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం బడికి సెలవు కావడంతోపాటు మధ్యాహ్నం తోటి పిల్లలతో కలిసి పెద్దచెరువుకు ఈతకు వెళ్లాడు. ఇంటికి వచ్చిన తండ్రికి ఈ విషయం తెలియడంతో చెరువు వద్దకు వెళ్లాడు.
కొంత సేపు తండ్రి ముందే కొడుకు సరదాగా ఈత కొట్టాడు. ఇంటికి వెళ్దామని తండ్రి చెప్పడంతో ఇదొక్కసారి దూకి వస్తానని పైనుంచి దూకడంతో ప్రమాదవశాత్తు నీటిలోని బురదలో కూరుకుపోయి ఎంతకూ బయటకు రాలేదు. దీంతో తండ్రి వెంటనే లోపపలికి దిగి బాలుడిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కొందరు గ్రామస్తులు వచ్చి చెరువు లోపలికి దిగి బురదలో కూరుకుపోయిన శివకుమార్‌ను బయటకు తీసి అడ్డాకుల పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని ఇంటికి తెచ్చారు.
బంధువుల ఆందోళన..
చెరువులో అక్రమంగా మట్టి తవ్వడంతో ఏర్పడిన గుంతల మూలంగానే బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. బాలుడి శవాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లడానికి ప్రయత్నించిన పోలీసులను అడ్డుకుని ఆందోళన చేశారు. పోలీసులు నచ్చజెప్పి బాలుడి మృతదేహాన్ని శివపరీక్ష ల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చెరువులో ఏర్పడిన గుంతలను ఎస్‌ఐ పరిశీలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తన కళ్ల ముందే బురదలో ఇరుక్కుని కొ డుకు ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి దుఃఖసాగరంలో మునిగిపోయా డు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment