
రోడ్లపై పారుతున్న మురుగు
కల్వకుర్తి టౌన్ : పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రెయినేజీలు లేక మురుగు రోడ్లపై పారుతుంది. కల్వకుర్తి పట్టణంలో మొత్తం 20వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో డ్రెయినేజీల నిర్మాణం సరిగా లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతామని చెబుతున్నా ప్రజాప్రతి నిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పందులకు ఆవాసంగా..
గ్రామపంచాయతీ అనుమతితో పలు కాలనీల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో ఇళ్ల మధ్యలో మురుగు నిలుస్తుంది. దాంతో పందులు సంచిరిస్తూ ఆవాసాలుగా మారుతున్నాయి. గుంపులు గుంపులుగా రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2.18కోట్లు
కల్వకుర్తి పట్టణంలో ఇప్పటివరకు 20 కాలనీల్లో డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2కోట్ల18లక్షలు నగరపంచాయతీ ఖర్చుచేసింది. యీ నిధులతో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టామని పాలకులు చెబుతున్నా వివిధ కాలనీల్లో మురుగు మాత్రం రోడ్లపైనే పారుతోంది. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేకపోతున్నామని పట్టణంలోని వివిధ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు పంపాం
పట్టణంలో మురుగు రోడ్లపై పారుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. రూ.కోట్లు ఖర్చుచేసినా డ్రెయినేజీల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మురుగు కాల్వలు, రోడ్ల కోసం రూ.20కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాం.
– రాచోటి శ్రీశైలం, చైర్మన్, నగర పంచాయతీ

నగరపంచాయతీ కార్యాలయం

ఇళ్ల మధ్యలో నిలిచిన మురుగు
Comments
Please login to add a commentAdd a comment