చెన్నైలో మరో విషాదం..
చెన్నైలో మరో విషాదం..
Published Mon, Jul 7 2014 1:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
ప్రహరీ గోడ కూలి 11 మంది మృత్యువాత
చెన్నై శివారులో ఒక భవనం ప్రహరీ గోడ కుప్పకూలటంతో తొమ్మిది మంది శ్రీకాకుళం జిల్లా వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఒడిశా వాసులూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో రెండేళ్ల బాలుడు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
సాక్షి, చెన్నై: చెన్నైలో వారం రోజుల కిందట 35 మంది ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికులతో సహా 67 మందిని బలితీసుకున్న అపార్ట్‌మెంట్ భవనం శిథిలాలను పూర్తిగా తొలగించకముందే.. చెన్నై సమీపంలోనే మరో ఘోర దుర్ఘటన సంభవించింది. ఆదివారం వేకువ జామున చెన్నై శివారులో ఒక భవనం ప్రహరీ కుప్పకూలటంతో తొమ్మిది మంది శ్రీకాకుళం జిల్లా వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఒడిశా వాసులూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో రెండేళ్ల బాలుడు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారం కిందట చెన్నైలోనే 11 అంతస్తుల అపార్ట్‌మెంట్ కూలిన ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 14 మంది వలస కూలీలు మరణించిన విషాదం నుంచి తేరుకోకముందే.. ఆదివారం అదే తమిళనాడులో ఇదే జిల్లాకు చెందిన 9 మందిని గోడ రూపంలో మృత్యువు కబళించటంతో జిల్లా వాసులు ఖిన్నులయ్యారు. చెన్నై శివారు తిరువళ్లూరు జిల్లా చోళవరం పోలీసుస్టేషన్ పరిధిలోని ఉప్పరపాళయంలో పెప్సీ కంపెనీ అద్దెకు ఉపయోగించుకుంటున్న ఓ గోడౌన్ భవనానికి కూతవేటు దూరం లో మరో భవనం నిర్మాణ పనులు చేపట్టారు.
సదరు గోడౌన్ యజమానులు రామనాథన్, తుపాకీబాలన్‌లు శ్రీకాకుళం, ఒడిశాలకు చెందిన కూలీలను నిర్మాణ పనుల నిమిత్తం నియమించుకున్నాడు. వీరి కోసం తన గోడౌన్ చుట్టూ 15 అడుగుల ఎత్తున్న ప్రహరీకి ఆనుకుని గుడిసెలు వేయించాడు. ఈ గోడ పునాదులు బలహీనంగా ఉండటంతో.. శనివారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షానికి గోడ నానిపోయి ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కుప్పకూలింది. ఆ గోడకు ఆనుకుని ఉన్న గుడిసెల్లో నిద్రిస్తున్న కార్మికుల కుటుంబాలు ఆ శిథిలాల కింద మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఉదయం 6.30కి వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలానికి నెల్లూరు ఆర్‌డీఓ...
ప్రమాద ఘటనలో ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడాన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడిని నాగరాజు (19)గా గుర్తించారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులుగా తేలారు. నెల్లూరు ఆర్‌డీఓ ఎం.వి.రమణ స్టాన్లీ ఆస్పత్రికి చేరుకుని నాగరాజును పరామర్శించారు. కాగా భవన యజమానులు రామనాథన్, బాలన్‌లను పోలీ సులు అరెస్టు చేశారు. ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మృతులకు రూ. 5 లక్షలు: చంద్రబాబు
చెన్నై దుర్ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.
జగన్ దిగ్భ్రాంతి: చెన్నై దుర్ఘటన పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మృతి చెందిన వారికి తన సంతాపాన్ని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Advertisement
Advertisement