బాధిత బాలిక తల్లిదండ్రులు
రాజ్ పూర్: కోవిడ్ -19 కారణంగా అమలవుతున్న లాక్‌డౌన్ నిరుపేద కుటుంబాలను, వలస కార్మికులను కష్టాల కడలిలోకి నెట్టేస్తోంది. వలస వచ్చిన ఊర్లో ఉపాధి కరువై నిలువ నీడలేక కనీసం అయిన వాళ్లతో అయినా ఉందామన్న ఆశతో ఊరు విడుస్తున్న వారిపై పంజా విసురుతోంది. కాలినడకన సుదీర్ఘ ప్రయాణం కట్టిన వారికి తీరని శోకం మిగులుస్తోంది. ఇలాంటి హృదయ విదారక గాథలు రోజుకొకటి వెలుగులోకి వస్తూ..ఇలాగ ఇంకెందరో అనే ఆవేదనను మిగులుస్తోంది. త్వరగా ఇంటికి చేరాలనే గంపెడాశతో మూడు రోజులు నడిచి, మరో కొన్నిగంటల్లో ఇంటికి చేరుతుందనగా ఇంటికి 14 కిలోమీటర్ల దూరంలో తీవ్ర అనారోగ్యం పాలై ఓ 12 ఏళ్ల బాలిక తనువు చాలించిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఛత్తీస్‌గఢ్ కు చెందిన దంపతులు తమ ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయారు.
అండొరం మడ్కం (32) సుకమతి (30) దంపతుల ఏకైక కుమార్తె జమలో(12). సాధారణంగా అడవి నుంచి సేకరించిన అటవీ ఉత్పత్తులే వీరి జీవనాధారం. అయితే కష్టాల్లో ఉన్న అమ్మానాన్నకు తోడుగా వుందామనుకొని భావించిన జమలో తొలిసారి పనికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె గ్రామానికి చెందిన కొంతమంది మహిళలతో కలిసి రెండు నెలల క్రితం తెలంగాణలోని ఒక గ్రామానికి మిర్చి పనికి వెళ్ళింది. ఇంతలో కరోనా వైరస్, లాక్ డౌన్ లాంటి అనుకోని పరిస్థితులు రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. మరోవైపు లాక్‌డౌన్ ను మే 3 వరకు పొడిగించడంతో తమకిక పని లభించదని భావించి, 13 మంది (ముగ్గురు పిల్లలు,ఎనిమిది మంది మహిళలు) తో కలిసి ఏప్రిల్ 16న ఆమె సొంత గ్రామానికి నడక మొదలు పెట్టారు.ఈ క్రమంలో వాంతులు, తీవ్ర కడుపు నొప్పితో అనారోగ్యం పాలైంది జమలో. ఏప్రిల్ 18 న ఉదయం 8 గంటల సమయంలో ఛత్తీస్‌గడ్, బీజాపూర్ జిల్లా సరిహద్దుకు చేరుకోగానే జమలో కన్నుమూసింది.
ఈ బృందంలో ఒకరికి మాత్రమే ఫోన్ ఉంది కానీ, బ్యాటరీ అయిపోవడంతో అది కూడా స్విచ్ఆఫ్ అయిపోయింది. ఎట్టకేలకు భండర్‌పాల్ గ్రామస్తుల సాయంతో వారు జమలో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే భండర్‌పాల్ గ్రామస్తులు పోలీసులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజాపూర్‌కు చెందిన ఒక వైద్య బృందం వారిని క్వారంటైన్ కు తరలించారు. బీజాపూర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బీఆర్ పుజారి మాట్లాడుతూ పోషకాహార లోపంతో బాధపడుతున్నబాలిక, మూడు రోజులు నడక, అలసట, తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా చనిపోయి వుంటుందని భావిస్తున్నామన్నారు. జమాలోకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం జమలో మృతదేహాన్ని అండోరం , సుకమతికి అప్పగించారు. బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బాలిక కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment