పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించే కంగారూ కోర్టులో దారుణం చోటు చేసుకుంది.
కోలకతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించే కంగారూ కోర్టులో దారుణం చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య రగిలిన ఓ వివాదంపై విచారణ జరుపుతున్న క్రమంలో 17 ఏళ్ల బాలుడు షేక్ మోమిన్ అలీని నరికి చంపిన ఘటన కలకలం రేపింది. బంకూరా జిల్లాలోని ఓ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య రగిలిన వివాదం ఈ హత్యకు దారి తీసింది.
ఇంటర్మీడియట్ చదువుతున్నఅలీ, ఓ అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే అనుమానంతో చెలరేగిన వివాదాన్ని పరిష్కరించేందుకు కంగారూ కోర్టు సమావేశమైంది. ఇరువురి వాదనలు నడుస్తుండగానే ఆగ్రహంతో రగిలిపోయిన అమ్మాయి తరపు బంధువులు అలీపై పదునైన ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని రాయపూర్ సమీపంలో ఆరోగ్య కేంద్రానికి తరలించినా ఫలితం లేదు. అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
సుమారు 11 మంది వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు జిల్లా ఎస్పీ నీలకంఠ సుధీర్ కుమార్ తెలిపారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదనీ, కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా గతంలో మహిళను సామూహిక అత్యాచారం చేయాలంటూ కంగారూ కోర్టు ఇచ్చిన తీర్పు వివాదస్పదమైంది. ఇతర కులస్తుడిని ప్రేమించి జరిమానా కట్టనందుకు గ్రామ పంచాయతీ పెద్దలతో కూడిన కంగారూ కోర్టు ఓ యువతిపై 12 మందితో అత్యాచారం చేయించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.