బాల నేరస్థులుగా గుర్తించి వదిలేశారు!
గుజరాత్ లో ముగ్గురిని చంపిన ఘటనలో మూడు సింహాలను అరెస్టు చేసిన ఘటనలో రెండింటిని బాల నేరస్తులుగా గుర్తించిన అధికారులు వాటిని ప్రొబేషన్ లో వదిలేసేందుకు నిర్ణయించారు. ముగ్గురు గ్రామస్థులను చంపిన కేసులో గుజరాత్ గిర్ నేషనల్ పార్కులోని మూడు సింహాలకు తీవ్రమైన పనిష్మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. వాటికి జీవిత ఖైదును విధించేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగా వాటిని అబ్జర్వేషన్ లో ఉంచారు. కాగా దోషులుగా భావించిన మూడు సింహాల్లో రెండు చిన్న పిల్లలని తెలుసుకున్న అధికారులు జువైనల్స్ గా గుర్తించి వాటికి శిక్షను లేకుండా చేశారు.
గుజరాత్ అభయారణ్యంలో ముగ్గురు మనుషులను చంపి తిన్న సింహాలకు జీవిత ఖైదు వేసేందుకు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో రెండు బాల నేరస్తులని గుర్తించారు. ఓ మగ సింహం మనిషిని చంపి తినగా, మిగిలినవి అది మిగిల్చిన మాంసాన్ని మాత్రమే తిన్నాయని గమనించిన గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి సాసన్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో వదిలేయాలని నిశ్చయించింది. అయితే ఆరెండు సింహాలూ అడవిలో ఒకదానికి ఒకటి కలవకుండా ఉండేట్లు చేసి వాటి ప్రవర్తనను కొంతకాలం పరిశీలిస్తామని ఫారెస్ట్ అధికారి ఏపీ సింగ్ తెలిపారు.
గత మూడు నెల్ల కాలంలోనే అంబార్ది ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై దాడికి దిగుతున్న సింహాలు ముగ్గురిని హతమార్చడంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకొని, మొత్తం 17 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాటిలో మూడింటిని దోషులుగా తేల్చినా, వాటిలో రెండు బాల నేరస్తులుగా గుర్తించి వాటిని అడవుల్లో వదిలేందుకు సిద్ధం చేశారు.