ఉత్తరప్రదేశ్‌లో మత విద్వేషాలు చల్లారేలా లేవు. ముజఫర్ నగర్ మంటలు చల్లారకముందే.. కాన్పూర్‌లో విద్వేషాగ్ని రగిలింది. ఘటంపూర్ ప్రాంతంలో ఆదివారం చెలరేగిన అల్లర్లలో ఒకరు చనిపోగా, ఆరుగురు పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మత విద్వేషాలు చల్లారేలా లేవు. ముజఫర్ నగర్ మంటలు చల్లారకముందే.. కాన్పూర్‌లో విద్వేషాగ్ని రగిలింది. ఘటంపూర్ ప్రాంతంలో ఆదివారం చెలరేగిన అల్లర్లలో ఒకరు చనిపోగా, ఆరుగురు పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు గృహదహనాలకు పాల్పడటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భీతర్ గ్రామంలో రెండు రోజుల క్రితం ఒక ఇంటిలో దొంగతనం చేస్తున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు బాలలను గ్రామస్తులు పట్టుకుని, తీవ్రంగా కొట్టి, అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆదివారం వారిని ఆ ఊరిపెద్ద విడిపించి తీసుకువెళ్లాడు.
అయితే, తీవ్రంగా కొట్టడంతో ఆ పిల్లలు చనిపోయారన్న వదంతులు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఒక వర్గం వారి ఇళ్లు, దుకాణాలు లక్ష్యంగా రాళ్లదాడులు చేశారు. పదులసంఖ్యలో షాపులకు మంటలు పెట్టారు.ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఘర్షణల్లో ఒక షాప్ యజమాని మరణించాడు. మరో మహిళ 70% కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఘర్షణలకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని కాన్పూర్ గ్రామీణ ఎస్పీ అనిల్ మిశ్రా తెలిపారు.