క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ.. కత్తులతో దాడి
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ పిచ్ కోసం రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కత్తులతో పొడుచుకునేలా చేసింది. బుధవారం ఢిల్లీలోని మెహ్రాలీస్ డీడీఏ పార్క్‌లో క్రికెట్ ఆడుతున్న వర్గంతో మరో గ్రూప్‌కి పిచ్ కోసం వివాదం నెలకొంది. ఇది కాస్త పెద్దదవ్వడంతో రెండో గ్రూప్‌లోని యువకులు క్రికెట్ ఆడుతున్న వారిపై కత్తులతో దాడిచేశారు.
ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 8 నుంచి 10 మంది యువకులు మా పై దాడిచేసి డబ్బులు దోచుకెళ్లారని క్షతగాత్రుడి సోదరుడు ఒకరు మీడియాకు తెలిపాడు. గాయపడ్డ యువకులను ఏయిమ్స్‌కు తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.