ఈ రోడ్లలో వెళ్లారో.. దెయ్యాల వేట తప్పదు! | 5 haunted roads in India every traveller must avoid | Sakshi
Sakshi News home page

ఈ రోడ్లలో వెళ్లారో.. దెయ్యాల వేట తప్పదు!

Published Mon, Apr 4 2016 6:33 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

ఈ రోడ్లలో వెళ్లారో.. దెయ్యాల వేట తప్పదు! - Sakshi

ఈ రోడ్లలో వెళ్లారో.. దెయ్యాల వేట తప్పదు!

కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా గుండె ఆగిపోయేంత పనిచేస్తుంది. అలాగే శబ్దం కూడా.. కొన్ని ప్రయాణాలు నిశ్శబ్దంగా ప్రారంభమైనా.. ముగిసే సమయాని ఊహించనంత భయంకరంగా కనిపిస్తాయి. సాధరణంగా దూరపు ప్రయాణాలు.. అది కూడా సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడమంటే అందరికీ ఇష్టం. భిన్న ప్రకృతి అంశాలతో నిండిన భారత్లోని రోడ్లపై వెళ్లాలంటే ఇంకా ఇష్టపడతారు. తమకు నచ్చిన ప్రాంతాలు తనివితీరా చూస్తారు. అయితే, ఇలాంటి ప్రయాణాల్లో ఉండగా.. పక్కకు తల తిప్ప కూడని రహదారులు, రాత్రి వేళ ప్రయాణించకూడని రహదారులు, కనురెప్ప కూడా వాల్చకూడని రహదారులు, గుండెను గట్టిగా పట్టుకొని ప్రయాణం చేయాల్సి వచ్చే రహదారులు కూడా ఉన్నాయి. అవి ఎలాంటి రహదారులంటే..

మీరు జాలీగా కారు నడుపుతూ వెళుతుంటారు. వెనుక ఏ వాహనం కనిపించదు.. ఆ విషయం కాస్త ముందుకు వెళ్లాక మీకు తెలుస్తుంది. ఈలోగా ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది. చీమ చిటుక్కుమన్నా డీటీఎస్లో వినిపించినంత గట్టిగా గుండెను తాకుతుంది. ఏం జరుగుతుందా అంటూ ఒకసారి ఆ పక్కాఈపక్కా చూస్తూ పైకి చూస్తారు.. అసమయంలో ఓ చెట్టునీడ మీపై నుంచి పోతుంటుంది. అనూహ్యంగా మీ చూపు ఆ చెట్టుపైనే ఉండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టుపై ఓ తలలేని మొండెం కూర్చుని కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి తిరిగి గుండెను కొట్టుకునేలా చేసేలోగానే కారు వెళ్లి పల్టీ కొడుతుంది.. ఇదిగో ఇలాంటి అనుభవాలు కలిగించే రహదారులు మన దేశంలో కనీసం ఓ ఐదు ఉన్నాయి. ఒకసారి వాటిని గురించి పరిశీలిస్తే.. బహుషా ముందు జాగ్రత్తలైనా పాటించవచ్చేమో...

డేంజర్ 1: కాసరా ఘాట్
వేల ఎకరాల మధ్య పెద్దపెద్ద కొండల నడుమ ముంబయి-నాషిక్ జాతీయ రహదారి వెళుతుంటుంది. దాన్ని చూడగానే అబ్బా బలే ఉందే అనుకుంటూ కారును మరింత వేగంగా పోనివ్వాలనిపిస్తుంది. కానీ, ఈ రోడ్డు చాలా భయంకరమైనదట. ఏదో గుర్తు తెలియని ఆకారం ఈ రోడ్డుపై వెళ్లినవారిని పీడిస్తుందట. ఈ రోడ్డులో ఓ చెట్టుపై తల లేని ఒక మహిళ కూర్చుని ఉండటం తాము చూశామని ఎంతోమంది ప్రయాణికులు చెప్పారు. తల ఆకాశం వైపు ఎత్తకుండా డ్రైవింగ్ చేస్తే సేఫ్.. లేదంటే ఇక అంతేనట.

డేంజర్ 2: సత్యమంగళం వైల్డ్ లైఫ్ సాంక్చ్యూరీ కారిడార్
ఈ మార్గం తమిళనాడులో ఉంది. 209 జాతీయ రహదారికి వెళ్లాలంటే ఈ మార్గం ద్వారా దగ్గర. చుట్టూ అడవులు ఉండటంతో ఎంతో ఆహ్లాదంగా ప్రయాణం సాగుతుంది కానీ.. చాలామంది ఏం చెప్తుంటారంటే.. ఈ అడవుల్లో గాల్లో దీపపు లాంతర్లు వేలాడుతూ కనిపిస్తాయట. పెద్దపెద్ద అరుపులు వినిపించడంతోపాటు, ఈ అడవిలో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ ఆత్మ సంచరిస్తూ అందరిని బెంబేలెత్తిస్తుందట.

డేంజర్ 3: ఢిల్లీ-జైపూర్ హైవే
మీరు అల్వార్ మీదుగా జైపూర్ వెళ్లాలనుకుంటే జాతీయ రహదారి 11 ఏ మీదుగా రావాల్సి ఉంటుంది. ఇదే రోడ్డు గుండా భాంగడ్‌ కోట వైపునకు వెళ్లొచ్చు కూడా. అయితే, భాంగడ్ కోట పేరిట కూడా భయం పుట్టించే చరిత్ర ఉంది. అందులో ఎన్నో అభూత శక్తులు ఉండి అది చూసి వెళ్లేవారిని, ఆ మార్గం వైపుగా వెళ్లేవారిని వేధిస్తాయంట.

డేంజర్-4: కాషెడి ఘాట్
ముంబయి నుంచి గోవావైపుగా వెళ్లేవారు కాషెడీ ఘాట్ మీదుగా వెళ్లాలని అనుకుంటుంటారు. కానీ, ఆ ఆలోచన వీలయినంత మేరకు మానుకుంటే మంచిదట. ముఖ్యంగా రాత్రి వేళలో. ఎందుకంటే ఎవరో గుర్తు తెలియని ఆత్మ రోడ్డుకు అడ్డంగా వచ్చి అమాంతం కారును ఆపేసి ముందుకు కదలనివ్వదట. ఈ కంగారులో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవుతారని కూడా పలువురు చెప్తున్నారు.

డేంజర్ 5: ఈస్ట్ కోస్ట్ రోడ్డు
చెన్నై నుంచి పుదుచ్ఛేరికి మీరు వెళ్లాలనుకుంటే ఈస్ట్ కోస్ట్ మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ చక్కగా పచ్చని చెట్లతో నిండి రోండు లేన్ల వెడల్పులో ఎంతో స్మూత్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అయితే, ఈ రోడ్డు కూడా హాంటింగ్కు అవకాశం ఉన్న రోడ్డట. తెల్లటి చీర కట్టుకున్న ఓ దెయ్యం డ్రైవర్లకు సడెన్గా కనిపించి వారిని హడలెత్తించి ఘోరమైన రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యేలా చేస్తుందట. అంతేకాదు ఈ రోడ్డుపై అనూహ్యంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తాయని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement