నేడే కశ్మీర్, జార్ఖండ్‌లలో తొలి దశ పోలింగ్
* కశ్మీర్‌లో 15, జార్ఖండ్‌లో 13 స్థానాలకు ఎన్నికలు
* సమస్యాత్మక సీట్లు కావడంతో భద్రత బలగాల హై అలర్ట్
శ్రీనగర్/రాంచీ/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడే జరగనుంది. జమ్మూకశ్మీర్‌లో 15 స్థానాలకు, జార్ఖండ్‌లో 13 స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి, జార్ఖండ్‌లో మావోల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎన్నికల బహిష్కరణకు ప్రయత్నించండి
జమ్మూకశ్మీర్‌లో జమ్మూ ప్రాంతంలో 6 సీట్లలో, కశ్మీర్ లోయలోని 5 స్థానాల్లో, లడఖ్ ప్రాంతంలోని 4 నియోజకవర్గాల్లో మొత్తం 10 లక్షలకు పైగా ఓటర్లు 123 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. తొలిదశ బరిలో ఉన్న స్థానాల్లో భదర్వాలో అత్యధికంగా 1,04,354 పైగా ఓటర్లుండగా, లడఖ్ ప్రాంతంలోని నోబ్రాలో 13,054 మంది మాత్రమే ఓటు హక్కు కలిగిన వారు ఉన్నారు. భదర్వా బరిలోనూ అత్యధికంగా 13 మంది అభ్యర్థులుండటం విశేషం.
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల బహిష్కరణ విజయవంతమయ్యేలా చూడాలంటూ హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలు తమ స్థానిక కమాండర్లతో జరిపిన సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి రావడంతో పోలింగ్ జరిపే ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. మరోవైపు, ఉగ్రవాద దాడులకు, ఎన్‌కౌంటర్లకు ప్రఖ్యాతి గాంచిన జమ్మూకశ్మీర్‌లోని బందిపోర్‌లో ప్రస్తుతం ఎన్నికల హంగామా కొనసాగుతోంది.
ఎల్‌ఓసీ నుంచి కశ్మీర్ లోయలోకి చేరడానికి ఉగ్రవాదులకు సరక్షిత మార్గంగా పేరుగాంచిన బందిపోర్‌లోని మూడు నియోజకవర్గాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మిలిటెంట్లకు మద్దతివ్వడం తగ్గిందని స్థానిక నేతలు చెబుతున్నారు. అలాగే, అభివృద్ధి కార్యక్రమాల్లో జమ్మూ ప్రాంతం వివక్షకు గురవుతోందంటూ గతంలో విమర్శించిన బీజేపీ.. ఇప్పుడు కశ్మీర్ లోయలోని ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో అలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం లేదు.
జార్ఖండ్
జార్ఖండ్‌లో నేడు ఎన్నికలు జరుగనున్న మొత్తం 13 స్థానాలు మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు కావడంతో అక్కడ భారీగా బలగాలను మోహరించారు. అలాగే, ఆర్జేడీ, జేవీఎం నేతలపై నక్సలైట్లు దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఆ పార్టీల నేతలకు భద్రతను మరింత పెంచాలని కేంద్ర హోంశాఖ స్థానిక అధికారులను ఆదేశించింది. ఈ 13 స్థానాల్లో 18 మంది మహిళలు, 72 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. డాల్టన్‌గంజ్ స్థానం నుంచి అత్యధికంగా 26 మంది పోటీ పడుతుండగా, ఛాత్ర నుంచి ఏడుగురు మాత్రమే బరిలో ఉన్నారు.