
ఈవీఎం మొరాయింపు.. అబ్దుల్ కలాంకూ తప్పని నిరీక్షణ
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కనీసం గంట సేపు ఎదురు చూడాల్సివచ్చింది. కలాం ఓటు వేసేందుకు బుధవారం కె.కామరాజ్ మార్గ్ పోలింగ్ స్టేషన్కు వచ్చారు. ఆ సమయంలో ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన గంట సేపు ఎదురు చూసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు ఈవీఎంను మార్చడటంతో కలాం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది చాలా సుదీర్ఘ సమయమని, ఈవీఎంను మార్చేందుకు పట్టిన సమయానికి కలాం ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చుండేవారని ఓ అధికారి చెప్పారు.
ఈ పోలింగ్ కేంద్రంలో కలాంతో పాటు చాలామంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆర్మీ, నేవీ దళాల అధిపతులు ఓటు వేశారు. 'ఈవీఎం మొరాయించే సమయానికి 412 ఓట్లు పోలయ్యాయి. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్, నేవీ చీఫ్ డీకే జోషీ, కేంద్ర మంత్రి కపిల్ సిబల్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఓటు వేశారు' అని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 112 ఈవీఎంలు మార్చినట్టు చెప్పారు. సాంకేతిక సమస్యలే కారణమని ఆయన వెల్లడించారు.