
న్యూఢిల్లీ: యూపీ కాస్‌గంజ్‌లో మతఘర్షణలు, ఢిల్లీలో సీలింగ్ డ్రైవ్ అంశాలపై ప్రతిపక్షాల నిరసనలతో శుక్రవారం ఉదయం కొంతసేపు రాజ్యసభ వాయిదా పడింది. ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ఎస్పీ, ఆప్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయటంతో డిప్యూటీ స్పీకర్ కురియన్ సభను ఉదయం కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం ఆధార్ డేటా లీకేజీ వార్త అవాస్తవమని ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ రాజ్యసభలో స్పష్టంచేశారు.
ఏ వ్యక్తికి సంబంధించిన ఆధార్ సమాచారమైనా ఎవరైనా రూ.500కే కొనుక్కోవచ్చంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన వివాదాస్పద గో సంరక్షణ బిల్లును బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించుకునే సామర్ధ్యం న్యాయవ్యవస్థకు ఉందని న్యాయశాఖ సహాయ మంత్రి చౌదరి తెలిపారు. రైలు ప్రయాణికుల సంఖ్యతోపాటు ఆదాయాన్ని పెంచే ఫ్లెక్సి–చార్జీల విధానం అమలు చేయాలని యోచిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.