న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను గతరాత్రి బాగా పొద్దుపోయాక, మరో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. అరెస్టైన ఎమ్మెల్యేల్లో ఒకరు దళితుడు, మరొకరు ముస్లిం కాబట్టే వారినే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలోనే తనను కొట్టారని అన్షు ప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.
తమ పార్టీ ప్రతిష్టను మసకబార్చేందుకే బీజేపీ సీఎస్‌ను అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ పౌర సరఫరాల మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆయన సహాయకుడిపై సచివాలయంలో ఉద్యోగులు దాడిచేయగా ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం విదితమే. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఆధారం ఉన్నా పోలీసులు ఇంకా ఏ చర్యలూ తీసుకోలేదనీ, కానీ సీఎస్ ఆరోపణలకు ఆధారాల్లేకుండానే తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. మరోవైపు సీఎస్ తలపై స్పల్ప గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment