ఆదిలోనే అపశృతి
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన రాజ్యాంగ దినోత్సవం సంబరాల్లో ఆదిలోనే అపశృతి దొర్లింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం వివిధ దినపత్రికలలో ఇచ్చిన ప్రకటనలో ఘోరమైన తప్పు దొర్లింది. గురువారం ప్రముఖ దినప్రతికల్లో ప్రచురితమైన ఈ ప్రకటన పీఠికలో 'సామ్యవాద, లౌకిక' అనే పదాలను తొలగించడం వివాదం రేపింది. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పింది. ఘోరమైన తప్పు దొర్లిందని, విచారణకు అదేశించామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
మరోవైపు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తక్షణ విచారణకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల్లో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 26న అధికారులు రాజ్యాంగ పీఠికా ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.