పట్నా : కరోనా వైరస్ కట్టడికి స్వదేశీ వ్యాక్సిన్‌ను సత్వరం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఐసీఎంఆర్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్ మానవులపై పరీక్షలు పట్నాలోని ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్- పట్నాలో ఆస్పత్రి అధికారులు ఎంపిక చేసిన పది మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీరికి వాక్సిన్ తొలి డోసు ఇచ్చిన అనంతరం 14 రోజుల విరామం తర్వాత వీరిపై రెండవ డోస్‌ను పరీక్షిస్తారు. నిర్ణీత వ్యవధి పూర్తయిన అనంతరం వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించాయా అనేది పరిశీలిస్తారు.
కోవ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో ఈ ఆస్పత్రి ఒకటి. కాగా, 22 నుంచి 50 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులపై వ్యాక్సిన్ పరీక్ష చేపడతామని ఎయిమ్స్-పట్నా సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ పరీక్షలకు ముందు వెల్లడించారు. మరోవైపు సార్స్-కోవ్-2 వైరస్‌పై తమ ప్రయోగ్మాతక వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశిస్తున్నామని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా అంతకుముందు ఓ జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా తమ వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల మానవ పరీక్షలకు భారత్ బయోటెక్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోదం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment