హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ ఊహా చిత్రం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానశ్రయ స్థాయి హంగులతో భారత్‌లో రెండు రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారబోతున్నాయి. కేవలం 9 నెలల్లో ఈ అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతం కాబోతోంది. దేశ రైల్వే వ్యవస్థకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చే దిశగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హబీబ్‌గంజ్, గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్లకు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఇండియన్ రైల్వేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐఆర్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈవో లోహియా చెప్పారు. హబీబ్‌గంజ్ స్టేషన్ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్‌కు, గాంధీనగర్ స్టేషన్ నిర్మాణాన్ని 2019 జనవరికి పూర్తి చేయనున్నట్లు వివరించారు. భారత ప్రభుత్వం స్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ రెండు స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు కేటాయించింది.
హబీబ్‌గంజ్ స్టేషన్ - సదుపాయాలు
ఈ స్టేషన్‌లో కూర్చువడానికి అనువుగా ఉండే 600ల బెంచ్‌లు ఉంటాయని లోహియా చెప్పారు. విమానాశ్రయాల వలే టాయిలెట్స్, రిటైల్ ఏరియాస్(షాపులు, కేఫ్స్, ఫాస్ట్ పుడ్ సెంటర్స్), ఫ్రీ వైఫై వంటి సేవలు ఉంటాయి. లాంజెస్, వీడియో గేమ్ జోన్స్, వర్చువల్ మ్యూజియంలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో భారతీయ రైల్వే ఉందని వివరించారు. హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ రూపురేఖలు మారిపోయి ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా అది కనిపించబోతోందని తెలిపారు.
గాంధీనగర్ స్టేషన్
హబీబ్‌గంజ్ వలే గాంధీనగర్ స్టేషన్‌లో సదుపాయాలు ఉండనున్నాయి. ఈ స్టేషన్‌లో ఇప్పటికే 42 శాతం సివిల్ పనులు పూర్తి అయినట్లు లోహియా చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఇక్కడ స్టేషన్ మాత్రమే కాకుండా 300 గదులు ఉండే 5 స్టార్ హోటల్‌ను కూడా నిర్మిస్తున్నారు.
ఈ రెండు రైల్వేస్టేషన్లను ఐఆర్‌ఎస్‌డీసీ నిర్వహిస్తుందని లోహియా చెప్పుకొచ్చారు. వీటి నుంచి అత్యధికంగా ఆదాయం సాధించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. హబీబ్‌గంజ్ స్టేషన్ నిర్వహణకు ఏడాదికి నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఏడాదికి ఈ స్టేషన్ నుంచి వచ్చే ఆదాయం ఆరున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment