
ముగిసిన అమర్‌నాథ్ యాత్ర
జులై 2న ప్రారంభమై 48 రోజుల పాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర నేటితో ముగిసింది.
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. జులై 2న ప్రారంభమై 48 రోజుల పాటు సాగిన ఈ యాత్ర.. నేటి పూజా కార్యక్రమంతో ముగిసిందని ఆలయ అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్య కొంత తగ్గింది. 2,21,000 మంది యాత్రికులు మాత్రమే ఈ సారి అమర్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్నేళ్లలో యాత్రికుల సంఖ్య ఇదే తక్కువ అని తెలుస్తోంది.
దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న అమర్‌నాథ్ దేవాలయం సముద్రమట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు పరమశివుని దర్శనానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ సారి కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో భక్తుల సంఖ్య కాస్త తగ్గినా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.