
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా షహీన్‌బాగ్ ఘటనలను నివారించవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజధాని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా నిప్పులు చెరిగారు. షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బీజేపీకి మీరు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.
కాగా సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో వందలాది మంది గత 30 రోజులుగా చేపట్టిన నిరసనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా షహీన్‌బాగ్ ఘటనను అమిత్ షా ఆక్షేపించడాన్ని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా సాగే ఆందోళనలను తోసిపుచ్చడం అంటే మహాత్మాగాంధీ ప్రవచించిన అహింసా వాదాన్ని తోసిపుచ్చడమేనని వ్యాఖ్యానించారు.