స్మృతి ఇరానీ, అమిత్ షాకు ఎందుకు పడదు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా స్మృతి ఇరానీకి కీలకమైన మంత్రి పదవి లభించినప్పటికీ ఏ కేబినెట్ కమిటీల్లోనూ స్థానం లభించక పోవడం పార్టీ లోపల, వెలుపల చర్చనీయాంశం అయింది. ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీల్లోకిగానీ భద్రత, నియమకాలు, అకామిడేషన్ లాంటి మంత్రివర్గ కమిటీల్లోకిగానీ ఆమెను తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి పదవంటే ప్రభుత్వానికి ప్రతిబింబం లాంటిది. అలాంటి కీలక పదవిని నిర్వహిస్తున్న వారికి కేబినెట్ కమిటీల్లో స్థానం కల్పించడం పరిపాటి. స్మృతి ఇరానీకి ముందు సమాచార, ప్రసారాల శాఖ బాధ్యతలను స్వీకరించిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుకు కూడా పలు కమిటీల్లో భాగస్వామ్యం కల్పించారు. వారికి ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి కనుక కేబినెట్ కమిటీల్లో స్థానం కల్పించి ఉండవచ్చని ఎవరైనా వాదించవచ్చు. కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా ఈ ఆనవాయితీ కొనసాగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మనీష్ తివారీ సహాయ మంత్రిగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖకు పనిచేసినప్పటికీ ఆయనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి శాశ్వత ఆహ్వానితునిగా తీసుకున్నారు. అలాంటిది స్మృతి ఇరానీని క్యాబినెట్ కమిటీల్లో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆమె అంటే పడక పోవడమే కారణమని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ బీజేపీ నాయకుడు తెలిపారు. ఎందుకు పడదని రెట్టించి ప్రశ్నించగా ‘వెళ్లి అమిత్ భాయ్’నే అడగమని సమాధానం చెప్పిన ఆయన అంతకుమించి వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు.
2015, మార్చి నెల నుంచి వారి మధ్య సఖ్యత లేదని, అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ కార్యవర్గం నుంచి స్మృతి ఇరానీని తొలగించారు. ఎంతో మంది కేబినెట్ మంత్రులను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి కొత్తగా తీసుకున్నప్పటికీ ఆమెను తొలగించడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, స్మృతి ఇరానీని కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రిగా తొలిసారి తన కేబినెట్‌లోకి తీసుకున్నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె జౌళి శాఖకు మారినప్పటి నుంచి ఆమెను ఏ కేబినెట్ కమిటీల్లోకి తీసుకోలేదు.
ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చి వెంకయ్య నాయుడు తప్పుకోవడంతో ఆయన స్థానంలో స్మృతి ఇరానీకి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ దక్కింది. ఆమె తిరిగి తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంటున్నారని, ఆమె తన వారసురాలిగా ఎంపికవడం పట్ల వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆమెను కేబినెట్ కమిటీల్లోకి తీసుకోకపోవడం అమిత్ షాకు ఇష్టం లేకపోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకు ఇష్టంలేదు, ఆమె అంటే ఆయనకు ఎందుకు చెడిందన్న ప్రశ్నకు మాత్రం ఎవ్వరూ బయటకు సమాధానం చెప్పడం లేదు.