ముంబై : దేశ ఆర్థిక నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఏకంగా ఆరు గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఎయిర్‌లైన్స్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రాత్రి 9.55 గంటల వరకూ రన్‌వేపైనే నిలిచిపోయింది. విమానం టేకాఫ్‌లో తీవ్ర జాప్యంపై ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో కామెంట్స్ చేశారు. విమానంలోనే తమను ఆరుగంటల పాటు కూర్చోబెట్టారని, విమానం టేకాఫ్ తీసుకోదు..తమను వెలుపలికి అనుమతించరు..అసలు ఏం జరుగుతోందని పూజా రాఠీ ట్వీట్ చేశారు. మరికొందరు ఇలాంటి ఎయిర్‌లైన్స్ లైసెన్సును ఎందుకు రద్దు చేయరంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. కాగా, ముంబైలో అసాధారణ రీతిలో భారీ వర్షాలు కురవడంతో గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది, విమాన సిబ్బంది, కెప్టెన్లు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదని దీంతో ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాల్లోనూ జాప్యం చోటుచేసుకుందని, సాధారణ పరిస్థితి నెలకొనేలా ప్రయత్నిస్తున్నామని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment