
నేటి నుంచి ‘సీఎం’ కేజ్రీవాల్
రాజకీయాలను ప్రక్షాళిస్తానంటూ సామాన్యుని పక్షాన రంగంలోకి దిగి దుమ్ము రేపిన అరవింద్ కేజ్రీవాల్, అదే సామాన్యుల నడుమ సాదాసీదా రీతిలో హస్తిన పాలనా పగ్గాలు చేపట్టనున్నారు.
ప్రజల నడుమ ప్రమాణ స్వీకారం
రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలను ప్రక్షాళిస్తానంటూ సామాన్యుని పక్షాన రంగంలోకి దిగి దుమ్ము రేపిన అరవింద్ కేజ్రీవాల్, అదే సామాన్యుల నడుమ సాదాసీదా రీతిలో హస్తిన పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఆరుగురు సహచరులు మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, గిరిషీ సోని, సత్యేంద్ర కుమార్ జైన్ కూడా మంత్రులుగా కేజ్రీవాల్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారు. అవినీతిపై పోరాటం నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దాకా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రమాణస్వీకారం విషయంలోనూ రొటీన్‌కు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి వీఐపీలకు ఆహ్వానం పంపడం, వీఐపీ పాసులు జారీ చేయడం వంటి ఆనవాయితీని పక్కన పెట్టారు. అందుకు బదులుగా, ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఢిల్లీ వాసులను ఆహ్వానించారు.
మైదాన్‌లో తన, పార్టీ ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా సామాన్యులతో పాటే కూర్చుంటారని ప్రకటించారు. రామ్‌లీలా మైదాన్‌లో ఒక సీఎం ప్రమాణ స్వీకారం జరగనుండటం ఇదే తొలిసారి. పైగా ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్ బృందం మెట్రో రైల్లో వెళ్లనుంది. కౌశాంబీ నుంచి మైదాన్ దాకా మెట్రోలో వెళ్తామని కేజ్రీవాల్ తెలిపారు. అవినీతి వ్యతిరేకోద్యమంలో తనకు గురువైన అన్నాహజారేకు ఆయన ఫోన్ చేసి ప్రమాణానికి ఆహ్వానించారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న అన్నా వచ్చేదీ రానిదీ తెలియడం లేదు. 45 ఏళ్ల కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంలలో అతి పిన్న వయస్కుడు కానున్నారు. ఆయన మంత్రివర్గం కూడా అతి పిన్న వయస్కుల బృందంగా రికార్డు సృష్టించనుంది. 41 ఏళ్ల మనీశ్ సిసోడియానే వారందరిలోనూ పెద్దవాడు కాగా, అతి పిన్న వయస్కురాలైన రాఖీ బిర్లాకు 26 ఏళ్లు. మంత్రివర్గంలో ఏకైక మహిళ కూడా ఆమే.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ 28 సీట్లతో ప్రభంజనం సృష్టించగా, మూడు పర్యాయాలు వరుసగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకోవడం తెలిసిందే. కాంగ్రెస్ బయటి నుంచి ఇస్తున్న మద్దతుతోనే ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రమాణ కార్యక్రమానికి లక్ష మందికి పైగా తరలి వస్తారని ఢిల్లీ పోలీసుల అంచనా. దాంతో రామ్‌లీలా మైదాన్‌లో మూడంచెల రక్షణతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కిరణ్ బేడీ, సంతోష్ హెగ్డేలను కూడా ఆప్ తరఫున ఆహ్వానించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కేజ్రీవాల్ కోరారు. సుష్మాస్వరాజ్‌తో పాటు మాజీ సీఎంలందరికీ ఆహ్వానం అందినా తాజా మాజీ సీఎం షీలాదీక్షిత్ మాత్రం రాకపోవచ్చంటున్నారు.
ఫైళ్లకు నిప్పు అవినీతికి నిదర్శనం.. కేజ్రీవాల్: అధికార మార్పిడి నేపథ్యంలో ఢిల్లీ సచివాలయంలో పలు కీలక ఫైళ్లను చించేస్తున్న, తగలబెడుతున్న వైనాన్ని ఆజ్‌తక్ వార్తా చానల్ స్టింగ్ ఆపరేషన్ వెలుగులోకి తెచ్చింది. దీనిపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. పలు శాఖల్లో పెచ్చరిల్లిన అవినీతికిది తాజా నిదర్శనమన్నారు. ముఖ్యమైన ఫైళ్ల రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఫైళ్లు కాలిన ఉదంతంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు ఆప్‌కు సంఘీభావం తెలిపేందుకు జమీల్ అహ్మద్ అనే యువకుడు చేయి కోసుకున్నాడు. శుక్రవారం కేజ్రీవాల్ తన నివాసం వద్ద నిర్వహించిన జనతా దర్బార్‌కు వచ్చిన అతను, అకస్మాత్తుగా మణికట్టును బ్లేడుతో కోసుకున్నాడు. కేజ్రీవాల్ సూచనపై ఆప్ కార్యకర్తలు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కరెంటు నుంచి నీటి దాకా పలు సమస్యలపై వేలాదిగా ప్రజలు దర్బార్‌కు వచ్చి కేజ్రీవాల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.