గువాహటి : కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్‌డౌన్ గడువు మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వైరస్ కట్టడి కాకపోవడం, పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోకి రాకపోవడం వంటి అంశాల కారణంగా లాక్‌డౌన్‌ను మరికొన్నాళ్ల పాటు పొగించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హాట్ స్పాట్ ప్రాంతాల్లో మే 31 చివరి వరకు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ వంటి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించింది. తాజాగా లాక్‌డౌన్‌ను మరోరెండు వారాల పాటు పొడిగించాలని కోరుతూ అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనొవాల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. (దేశంలో మరో 3,967 పాజిటివ్ కేసులు)
రాష్ట్రంలో పరిస్థితి ఇప్పడిప్పుడే అదుపులోకి వస్తోందని, ఈ సమయంలో ఆంక్షలను ఎత్తివేయడం సరైనది కాదని లేఖలో పేర్కొన్నారు. ఇక తమిళనాడు, గుజరాత్‌తో పాటు మధ్య ప్రదేశ్ సర్కార్ కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని పట్టుపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే ఆంక్షల నడుమ లాక్‌డౌన్ పాటించాలని ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో మే చివరి వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. వైరస్ కట్టడికి తెలంగాణ బాటలోనే మిగతా రాష్ట్రాలు కూడా పయనించాలని భావిస్తున్నాయి. దీనిపై శని, ఆదివారాల్లో కేంద్ర నుంచి తుది ప్రకటన రానుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్‌డౌన్ కొనసాగనుందని సూచించిన సంగతి తెలిసిందే. మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. (కరోనా: చైనాను అధిగమించనున్న భారత్)
ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో పాటు, వైరస్ సోకి 100 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. (విదేశాల నుంచి రాకతో పెరిగిన కరోనా)
Comments
Please login to add a commentAdd a comment