ఆపత్కాలంలో అస్సాం కీలక నిర్ణయం! | Lockdown Assam Decides To Financial Help People Stranded Other Places | Sakshi
Sakshi News home page

ఆపత్కాలంలో అస్సాం కీలక నిర్ణయం!

Published Mon, Apr 13 2020 7:36 PM | Last Updated on Mon, Apr 13 2020 8:03 PM

Lockdown Assam Decides To Financial Help People Stranded Other Places - Sakshi

గువాహటి: కరోనా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఆన్‌లైన్‌ ద్వారా వారందరికీ ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి బిశ్వ శర్మ సోమవారం వెల్లడించారు. ఇందుకోసం త్వరలో హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ‘దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిక్కుకుపోయిన అస్సాం వాసులు హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా ఓ లింక్‌ వస్తుంది. దాన్ని అనుసరించి తమ వ్యక్తిగత వివరాలు.. బ్యాంకు ఖాతా వివరాలతో ఆర్థిక సాయానికై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత.. డబ్బు ఆయా బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది’అని మంత్రి పేర్కొన్నారు. అయితే, దరఖాస్తుల ప్రక్రియ పూర్తవనిదే.. ఎంత మొత్తం సాయం చేస్తామనేది తేల్చలేమని అన్నారు.
(చదవండి: లాక్‌డౌన్‌: ఆ 25 జిల్లాల్లో కాంటాక్ట్‌ కేసులు లేవు)

అప్లికేషన్ల ప్రక్రియలో తమతో కలిసి పనిచేసేందుకు పిరమల్‌ ఫౌండేషన్‌, అస్సాం ఇంజనీరింగ్‌ కాలేజ్‌, కాటన్‌ యూనివర్సిటీ, గువాహటి యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని మంత్రి తెలిపారు. ఆర్థిక సాయం అమలుకు డేటాబేస్‌ను రూపొందిస్తామని బిశ్వ శర్మ వెల్లడించారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చేవారెంతమందో లెక్కతీసి ముందుజాగ్రత్త చర్యగా వారందరికీ తగిన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులు, చిరుద్యోగులు ఇళ్లకే పరిమితమై... జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి వివరాలు తెలుసుకుంటున్నామని అన్నారు. ఇదిలాఉండగా.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయిన రోగుల కుటుంబాలను ఆదుకునేందుకు అస్సాం ప్రభుత్వం ఒక్కో పేషంట్‌కు రూ.25 వేలు అందించి పెద్ద మనసు చాటుకుంది. దాంతోపాటు విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరులను ఆదుకునేందుకు 21 మందికి తొలి విడతగా వెయ్యి డాలర్ల చొప్పున అందించింది.
(చదవండి: ‘74 మంది అనుమానితుల శాంపిల్స్‌ సేకరణ’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement