హామీలెక్కువ.. ఇచ్చింది తక్కువ
హామీలెక్కువ.. ఇచ్చింది తక్కువ
Published Fri, Jul 11 2014 2:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు అంతంతమాత్రమే
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రెవెన్యూ లోటు పూడ్చేందుకు నిధులు.. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు.. ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్, వివిధ యూనివర్సిటీలు.. విశాఖలో మెట్రో.. విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో.. ఇలా ఎన్నో ఆశలు పెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తీరుస్తామన్నారు. ఈ మాటలన్నీ విన్న ఏపీ ప్రజానీకం కేంద్ర బడ్జెట్ కోసం ఆత్రంగా ఎదురు చూసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమీ లేదు. ఏవో కొన్ని తాయిలాలు తప్ప.. చాలావరకు హామీలను నెరవేర్చలేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి.. ప్రత్యేకించి కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.
వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15,691 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. దీనిని భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ, ఈ బడ్జెట్‌లో కేంద్రం రూ.1,180 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంకా రూ.14,511 కోట్ల లోటు ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 250 కోట్లు కేటాయించింది. తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం, సీమాంధ్రకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్లాన్ ఔట్ లే కింద రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ వర్శిటీలకు నిధులు ఒకే ఏడాది కేటాయిస్తారా? లేక విడతలవారీగా కేటాయిస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐటీ, ఐఐఎం తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ప్రాథమికంగా ఒక్కో కోటి చొప్పున కేటాయించారు.
బీజేపే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా దేశంలో 100 స్మార్ట్ సిటీలను రూ. 7,060 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘనంగా ప్రకటించినా.., ఆంధ్రప్రదేశ్‌కు అత్యావశ్యకమైన రాజధాని నిర్మాణం గురించి పట్టించుకోలేదు. రాజధాని నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తినీ పట్టించుకోలేదు. ఏపీలో మెగాసిటీలు, స్మార్ట్ సిటీల నిర్మాణం గురించి బీజేపీ నేత వెంకయ్యనాయుడు పలుమార్లు చెప్పడమే తప్ప, బడ్జెట్‌లో వాటిని చేర్చడంలో కృతకృత్యులు కాలేకపోయారు.
విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ప్రకటన కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలో ఆల్ట్రా మెగా సోలార్‌పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పోర్టును పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందించనున్నట్లు ప్రకటించారు. కాకినాడ పోర్టు అభివృద్ధికి నిధులిస్తామన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మాత్రం ఇతరత్రా ఏమీ లేవు.
ఆర్థికంగా చేయూత అనుమానమే!
బడ్జెట్‌లో ఏపీని ఆర్థికంగా ఆదుకొనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఆర్థిక లోటు, రాజధానికి కలిపి కొంచెం నిధులే కేంద్రం విదిలించింది. దీంతో కేంద్రం నుంచి నిధులు దక్కడంపై అధికారవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రవాణా కష్టమే
ఏపీ కొత్త రాజధాని, హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని పునర్వ్యవవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కానీ బడ్జెట్‌లో ఈ ఊసే ఎత్త లేదు.
Advertisement
Advertisement