భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు | Australia Extends Strong Support To India Over Permanent UNSC Seat | Sakshi
Sakshi News home page

కీలక అంశాల్లో భారత్‌కు ఆసీస్‌ మద్దతు

Published Thu, Jun 4 2020 8:02 PM | Last Updated on Thu, Jun 4 2020 8:12 PM

Australia Extends Strong Support To India Over Permanent UNSC Seat - Sakshi

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు తెలిపింది. అదే విధంగా ఎన్‌ఎస్‌జీ(అణు సరఫరాదారుల సమూహం)లో భారత్‌ సభ్యత్వాన్ని బలపరుస్తున్నట్లు వెల్లడించింది. వివిధ అంశాలపై చర్చించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ గురువారం వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగం, మైనింగ్‌ సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఏడు ఒప్పందాలపై సంతకం చేసిన ఇరు దేశాధినేతలు.. ఇండో- పసిఫిక్‌ జలాల్లో పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత్‌ స్నేహబృందంలో ఆస్ట్రేలియా కూడా ఉందని.. కీలక అంశాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.(భారత్‌కు ఫ్రాన్స్‌ భారీ రుణ సాయం!)

ఇక ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌.. ‘‘ మనం మహాసముద్రాన్ని పంచుకుంటున్నాం. అదే విధంగా బాధ్యతలు కూడా పంచుకోవాల్సి ఉంది. ఆరోగ్యం, భద్రత రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలి’’అని వ్యాఖ్యానించారు.  ‘‘యూఎన్‌ఎస్‌సీలో భారత శాశ్వత అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నామని ఆస్ట్రేలియా పునరుద్ఘాటిస్తోంది. పౌర అణు ఒప్పందాల్లో ఇరు దేశాలు పరస్పరం అండగా నిలబడతాయి. అదే విధంగా ఎన్‌ఎస్‌జీలో కూడా భారత సభ్యత్వం కల్పించే అంశంలో ఆస్ట్రేలియా పూర్తి మద్దతు తెలియజేస్తోంది ’’ అని ఇరు దేశాలు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అదే విధంగా భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సిందిగా​ ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీని ఆస్ట్రేలియా స్వాగతించింది. కాగా యూఎన్‌ఎస్‌సీలో భారత శాశ్వత సభ్యత్వానికి పలు దేశాలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. (తెలుగు ఐఏఎస్‌ రవి కోటకు కీలక పదవి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement