'అమ్మ' జయలలితపై వీరభక్తి అదిరింది!
భావి ప్రధాని అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న జయలలిత వీరభక్తులు చేసిన ఈ తాజా వ్యవహారం తమిళ తంబీలు ఏది చేసినా అతిగానే ఉంటుందనే వాదనకు మరింత బలం చేకూర్చింది.
ఎన్నికలు సమీపిస్తున్నా.. కొత్త సినిమా విడుదలైనా.. అభిమానుల చేసే సందడి అంతా ఇంతా ఉండదు. ఏదైనా సందర్భం వచ్చిందంటే ఇక అధినేతల్ని, వారి అభిమాన తారల్ని ఆకట్టుకోవడానికి అభిమానులు చేసే ఫీట్లు ఒక్కోసారి అతిగా స్పందించారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తమ ప్రమేయం లేకుండానే అభిమానులు చేష్టలు కొన్నిసార్లు సినీ తారలకు, రాజకీయ నేతల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉంటుంది. రాజకీయ నేతల్ని, సినీ తారల్ని దృష్టిని ఆకర్షించడానికి చోటా నాయకులు హద్దు మీరి ప్రవర్తించే తీరు అన్నివర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
సినీతారగా లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జన్మదినం సందర్భంగా తమిళ తంబీలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పురచ్చి తలైవరిని ఆకట్టుకోవడానికి పార్లమెంట్ నమూనాలో భారీ కేకును తయారు చేయించి అధినేత్రిని ఖుష్ చేసిన సంగతి మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభిమానుల్లో మరి కొందరు మరో అడుగు ముందేసి ఏకంగా ప్రపంచ అగ్రనేతలందరూ.. జయలలితను ఏకంగా కీర్తిస్తున్నట్టు కోయం బత్తూరులో వెలిసిన ఫ్లెక్సీ విమర్శలకు దారి తీస్తోంది.
ప్రపంచ అగ్రనేతల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నార్త్ కోరియా డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, సర్కోజిలాంటి అగ్రనేతలు జపం చేస్తున్నట్టు అభిమానులు ఫెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) ఓ మూలకు నెట్టడం గమనార్హం. భావి ప్రధాని అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న జయలలిత వీరభక్తులు చేసిన ఈ తాజా వ్యవహారం తమిళ తంబీలు ఏది చేసినా అతిగానే ఉంటుందనే వాదనకు మరింత బలం చేకూర్చింది.