
దేశ సేవకు అంకితంకండి
మంత్రుల ప్రమాణానికి ముందు నేతలకు మోదీ దిశానిర్దేశం
తేనీటి విందులో బాధ్యతల నిర్వహణపై గంటపాటు సూచనలు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ఆదివారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన 21 మంది నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు తేనీటి విందు ఇచ్చారు. సుమారు గంటపాటు సాగిన ఈ భేటీలో నేతలకు కీలకాంశాలపై మోదీ దిశానిర్దేశం చేశారు. బాధ్యతల నిర్వహణలో వ్యవహరించాల్సిన తీరును వారికి వివరించారు. ముఖ్యంగా దేశ సేవకు అంకితం కావాల్సిందిగా నేతలందరికి సూచించారు. అలాగే ఎక్కువ గంటలపాటు పని చేయాలని కోరారు. మంత్రిత్వశాఖలకు సంబంధించిన అన్ని విషయాలను త్వరగా నేర్చుకోవాలని, తన సిద్ధాంతాలను అనుసరించాలని సూచించారు. చివరగా ప్రమాణస్వీకారం సమయంలో ఎలా మెలగాలో వారికి పలు సూచనలు చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం మోదీ నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ అభివృద్ధి ప్రయాణ వేగాన్ని పెంచడంలో నూతన మంత్రులతో కలసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధాని ‘ట్వీట్’ చేశారు. కాగా, ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు జె.పి. నడ్డా, చౌధురి బీరేందర్‌సింగ్, రాజీవ్‌ప్రతాప్ రూడీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, హన్స్‌రాజ్ ఆహిర్, జయంత్ సిన్హాలు మాట్లాడుతూ ప్రధాని అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, నిజాయితీతో నిర్వహించి ప్రధాని మోదీ అంచనాలకు అనుగుణంగా రాణిస్తామన్నారు. తద్వారా ప్రజలకు మచ్చలేని పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.