‘కొత్తగా స్నేహితులను చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే అందుకోసం ఏవేవో ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు.. మీ మొబైల్ ఫోన్ తీసుకోండి.. మా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. అంతే మీ ఆలోచనలకు సరితూగే వేలాది మంది మీ కోసం ఎదురుచూస్తున్నారు.. వెంటనే వారితో ముచ్చటించండి.. స్నేహితులుగా మారండి..’ ఇవీ డేటింగ్ సైట్లు చెబుతున్న మాటలు..
ఇటీవల ఢిల్లీలో 52 ఏళ్ల మహిళకు ఓ డేటింగ్ యాప్‌లో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిసి స్నేహితులుగా మారారు. ఓ రోజు నేరుగా కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఇలా తరచూ కలుస్తుండేవారు.. కానీ ఓ రోజు ఆ మహిళ తన అపార్ట్‌మెంటులో హత్యకు గురైంది. తీరా చూస్తే ఆ ‘స్నేహితుడే’ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. డేటింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండకపోతే జరుగుతున్న పరిణామాలకు ఇదో చిన్న ఉదాహరణ.
దేశంలో ఇప్పుడు డేటింగ్ యాప్‌లు, సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లను రూపొందిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్లు ఉండటంతో వెంటనే ముందూ వెనుక చూడకుండా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా వీటిని వాడుతున్నారు. కొందరేమో నిజంగానే స్నేహితుల కోసం ఈ యాప్‌లను వాడుతుండగా.. మరికొందరేమో మోసం చేయాలనే దురుద్దేశంతోనే వీటిని వాడుకుంటున్నారు. అయితే వీరి వలలో పడి మోసపోయిన వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు కానీ చెప్పడానికి భయపడుతున్నారు. సమాజంలో పరువు పోతుందని భావించి ఎవరితో చెప్పుకోకుండా వారిలో వారే మథనపడుతున్నారు. ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
‘స్కౌట్’యాప్‌తో మోసాలు..
విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకుని స్కౌట్ అనే డేటింగ్ యాప్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని కొందరు బాధితులు ‘సాక్షి’తో వాపోయారు. అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడిస్తామని మాయ మాటలు చెప్పారన్నారు. వీడియో కాల్ మాట్లాడాలంటే డబ్బులు పంపాలని అడిగారని.. నిజంగానే మాట్లాడతారేమోనన్న ఆశతో డబ్బులు పంపామన్నారు. డబ్బులు పంపిన వెంటనే తమ నంబర్లు బ్లాక్‌లో పెట్టారని, మోసపోయామని తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌లో ప్రకటన ద్వారా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నామని, ఈ యాప్ తో అనేకమంది విద్యార్థులు ఇందులో ఇరుక్కుని, నష్టపోతున్నారని, ఎవరితో చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగానే కాకుండా.. తెలంగాణ, ఏపీల్లో కూడా ఈ దందా జరుగుతోందని పేర్కొన్నారు.
సాధారణంగా చేసే తప్పులు...
► వీడియో కాల్ లేదా వెబ్ కెమెరా ద్వారా మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమరుపాటు ప్రదర్శించినా చిక్కుల్లో పడతారు. స్క్రీన్ షాట్లు తీసి, మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉంది.
► డేటింగ్ సైట్లలో ప్రతి పది మందిలో ఒకరు నగ్న చిత్రాలను పంచుకుంటున్నారట. బాగానే మాట్లాడుతున్నారు కదా అని నగ్న చిత్రాలను వారితో షేర్ చేస్తే అంతే సంగతులు..
► వ్యక్తిగత విషయాలను ఎదుటివారితో సులువుగా పంచుకుంటారు. మీ అడ్రస్.. మీ తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యం ఇలా ఏవీ కూడా ఎవరితోనూ డేటింగ్ యాప్‌లల్లో పంచుకోకూడదు.
► డేటింగ్ యాప్‌లల్లో ఉన్నవారు దాదాపు 57 శాతం మంది తమ గురించి పూర్తిగా అబద్ధాలే చెబుతున్నారట. ఉద్యోగం, పెళ్లి, రూపం, ఆకారం, నేపథ్యం ఇలా అన్ని విషయాల్లో అబద్ధమే చెబుతున్నారని తేలింది.
మోసగాళ్లను ఎలా గుర్తించవచ్చు..
డేటింగ్ సైట్లలో మోసగాళ్లను ఎలా గుర్తించాలో సైబర్ నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. వాటిని పాటిస్తే కొంతలో కొంత వారి బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. వాటిలో కొన్ని..
- అవతలి వ్యక్తి భాష, వాక్య నిర్మాణం, ఇంగ్లిష్ సరిగా లేకపోయినా, అక్షర దోషాలున్నా వారిని దూరంగా ఉంచడమే మంచిది.
- ప్రొఫైల్‌పై ఉన్న ఫొటోను గూగుల్ సెర్చ్ చేయాలి. ఒకవేళ మోసగాళ్లయితే ఆ ఫొటో గూగుల్‌లో ఉంటుంది.
- స్నేహితులుగా మారిన తర్వాత.. ఏవేవో కష్టాలు, కథలు చెబుతూ.. డబ్బులు అడుగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ డబ్బులు పంపకూడదు. డబ్బుల గురించి మాట్లాడారంటే వారు మోసగాళ్లే.
- మోసపోయామని తెలిసిన వెంటనే ఇంట్లో వారికి కానీ.. పోలీసులకు కానీ కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. మోసగాళ్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటారు. అప్పుడే వేరే ఎవరూ మోసపోకుండా జాగ్రత్తపడతారు.
- ఆన్‌లైన్‌లో బాగా మాట్లాడుతున్నారు కదా.. నేరుగా కలుద్దామంటే ముందూ వెనుక ఆలోచించకుండా వెళ్లకూడదు. వెళితే ఏదైనా దారుణం జరగొచ్చు. ఇటీవలే ఫేస్‌బుక్ స్నేహితుడు.. లైంగిక కోరికలు తీర్చలేదని ఓ అమ్మాయిని దారుణంగా చంపిన విషయం తెలిసిందే.
- ఏవేవో లింకులు పంపి వాటిని చూడమంటే అస్సలు చూడకండి. ఆ లింకుల్లో అశ్లీల చిత్రాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి లింకులు తెరిస్తే మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో మాల్‌వేర్ డౌన్‌లోడై మీ వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment