ముంబై: శివసేనతో 25 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ,‘‘భవిష్యత్తులో మరో కూటమి ఎందుకుండాలి? మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎన్నికల తరువాత వారు (కాంగ్రెస్, ఎన్సీపీ) రాష్ట్రంలో కనుమరుగవుతారు’’ అని అన్నారు. ఎన్నికల అనంతరం ఎన్సీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న వాదన మతిలేని తర్కం అని, బాధ్యతారహితమైన వాదన అని అన్నారు.
మహారాష్ట్రలో ప్రస్తుత గందరగోళ పరిస్థితికి కాంగ్రెస్, ఎన్సీపీలు రెండూ కారణమేనని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీ అనంతరం ప్రధాని మోదీ ప్రచారానికి వస్తారని తెలిపారు. శివసేనతో పొత్తు విచ్ఛిన్నం కావడంపై రూడీ మాట్లాడుతూ, అది తమకు ఎంతో వేదనను కలిగించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్సీపీ వైదొలగిన నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను కోరుతారా అన్న ప్రశ్నకు, ఆ విషయాన్ని నిర్ణయించడానికి తాను తగిన వ్యక్తిని కాదని చెప్పారు. అయితే ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయినా, ముఖ్యమంత్రి రాజీనామా చేసిన రాష్ట్రపతి పాలన అనేది సహజమైన పరిణామమని రూడీ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఎన్సీపీతో తమకు ఎటువంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నాగపూర్‌లోని నైరుతి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్, కృష్ణా ఖోప్డే, వికాస్ కుంభార్కర్‌లుకూడా తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అది మతిలేని వాదన
Published Fri, Sep 26 2014 11:13 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement