బీజేపీకి చేరువయ్యేందుకే ఎన్సీపీ తమ నుంచి విడిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది.
న్యూఢిల్లీ: బీజేపీకి చేరువయ్యేందుకే ఎన్సీపీ తమ నుంచి విడిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ పరిణామం తమకు ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొంది. గత ఒకటిన్నర, రెండు నెలలుగా బీజేపీకి చేరువయ్యేందుకు ఎన్సీపీ ప్రయత్నాలు చేస్తోందని ఏఐసీసీ మీడియా విభాగం చైర్మన్ అజయ్ మాకెన్ చెప్పారు. ఈ పరిణామానికి తాము ముందునుంచే సిద్ధంగా ఉన్నామని, అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని అన్నారు.
దీర్ఘకాలంలో ఇది తమకు ఉపయోగపడగలదని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆశతో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగల నాయకత్వాన్ని ఇవ్వగలదని, అన్ని ప్రాంతాల్లో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉందని, పాలనలో అనుభవం గల నాయకులున్నారని చెప్పారు. ఈ మూడు లక్షణాలు ఏ పార్టీలోనూ లేవని అన్నారు. ప్రజల సంక్షేమం కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను ప్రధానమని ఎంచుకోవడం వల్లనే ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు.