
'పాక్ ను దెబ్బకు దెబ్బ తీయాలి'
న్యూఢిల్లీ: యూరి సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బకు తీయాలని బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్ అన్నారు. యూరి ఘటన తరహాలో పాకిస్థాన్ పై దాడి చేయాలని సూచించారు. ప్రతీకార దాడి చేసేంతవరకు ఇస్లామాబాద్ ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంటుందన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ చాలా ఏళ్లుగా కుట్రలు కొనసాగిస్తూనే ఉందని ఆరోపించారు. భవిష్యత్ లోనూ దాయాది దేశం కుట్రలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
'మనం దెబ్బకు దెబ్బ తీయనంత కాలం పాకిస్థాన్ తీరు మారదు. మనకు జరిగిన నష్టం వారికి జరిగితే పాకిస్థాన్ కళ్లు తెరుస్తుంద'ని సింగ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై నలుగురు ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.