
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా మంగళవారం విడుదలైంది.
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 125 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ నుంచి పోటీ చేయనుండగా, మంత్రి చంద్రకాంత్ పాటిల్ కొత్‌రుడ్ నుంచి బరిలో ఉంటారని తొలి జాబితాలో ప్రకటించారు. శివాజీ మహరాజ్ కుటుంబీకుడు శివేంద్ర సింగ్ సతారా నుంచి పోటీ చేస్తారు. ఇక తొలి జాబితాలో వినోద్ తవ్దే, ఏక్‌నాథ్ ఖడ్సే, సుధీర్ ముంగంతివర్ వంటి నేతలకు చోటు దక్కకపోవడం గమనార్హం. తొలి జాబితాలో 91 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కగా, 12 మంది సిట్టింగ్‌లకు మొండిచేయి చూపారు. తొలి జాబితాలో కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన ఐదుగురు నేతలు, ఎన్సీపీని వీడిన నలుగరు, ఇద్దరు ఇండిపెండెంట్లకు సీట్లు కేటాయించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనతో పొత్తు ఖరారైందని బీజేపీ వెల్లడించిన మరుసటి రోజే కాషాయ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం. అక్టోబర్ 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 24న వెల్లడిస్తారు.