
'షా'కు పట్టం.. 'మంత్రుల'కు కష్టం
అమిత్ షా బాధ్యతలు చేపట్టడమే తరువాయి.. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు ఉంటాయని విశ్వసనీయ సమాచారం.
గతేడాది బిహార్ లో ఘోర పరాజయానికి కారకులపై వేటు, ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. మరోవైపు కొరవడిన సుపరిపాలన, శాఖల అజమాయిషీలో మంత్రుల వైఫల్యం.. ఇన్ని విభిన్న అంశాల నడుమ అధికార బీజేపీలో జాతీయ అధ్యక్షుడి నియామకం కీలకంగా మారింది.
ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన అమిత్.. ఏడాదిన్నరకే మళ్లీ ఎన్నికను ఎదుర్కోవాల్సివచ్చింది. నిజానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు. అయితే నాటి అధ్యక్షుడు రాజ్ నాథ్ రాజీనామాచేసి మంత్రివర్గంలో చేరిపోవటంతో ఏడాదిన్నర కాలానికిగానూ అమిత్ షా అధ్యక్షుడయ్యారు. ఈ సారి పూర్తి(మూడేళ్ల) కాలానికి ఎంపిక జరగనుంది. గుజరాత్ కే చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుంగుడిగా పేరుపొందిన అమిత్ షాను మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా (ఏకగ్రీవంగా) ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. అమిత్ బాధ్యతలు చేపట్టడమే తరువాయి.. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు ఉంటాయని విశ్వసనీయ సమాచారం.
హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు తప్పిస్తే, ఇతర ప్రధాన శాఖల్లో భారీ మర్పులు ఖాయమంటున్నాయి పార్టీ వర్గాలు. కొన్ని ముఖ్య శాఖలకు మంత్రులుగా కొనసాగుతున్న సీనియర్ల పదవీకాలం త్వరలో ముగియనుండటం కూడా మార్పుల అనివార్యతకు కారణమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రుల్లో ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారంమేరకు ఆయా పార్టీలు ఈ ఇద్దరు నాయకులను మరోసారి కొనసాగించలేని స్థితిలో లేవు.
ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానిక బాధ్యులుగా ఒకరిద్దరు మంత్రులపై వేటుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుచి ఐదుగురు కేంద్ర మంత్రులున్నారు. వారిలో రవి శంకర్ ప్రసాద్ (కమ్యూనికేషన్స్, ఐటీ), రాధా మోహన్ సింగ్(వ్యవసాయ శాఖ), ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం సహజవాయువుల శాఖ)లు బీజేపీకి చెందినవారుకాగా, రాంవిలాస్ పాశ్వాన్(ఆహారం, ప్రజాపంపిణీల శాఖ మంత్రి) ఎల్జేపీ తరఫున, ఉపేంద్ర కుష్వాహా (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి) రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నుంచి ఎంపికయ్యారు. రవిశంకర్ రాజ్యసభ పదవీకాలం మరో రెండేళ్లు (2018 వరకు) ఉండటంతో రాధా మోహన్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ లపై వేటు పడే అవకాశాలున్నాయి. మిగతా ఇద్దరు ఎన్డీఏ భాగస్వాములు కాబట్టి వారికి మినహాయింపు ఉండొచ్చని వినికిడి.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రవైన ఉత్తరప్రదేశ్ లో వచ్చేఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఈ ఆరింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అడ్రస్ లేదు. మిగిలిన అసోం, యూపీల్లో మాత్రం సత్తాచాటాలని గట్టిగా భావిస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మంత్రివర్గంలోకి యూపీ నుంచి ఒకరిద్దర్ని ఎంపికచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి అత్యధికంగా 9 మంది కేంద్ర మంత్రులున్న సంగతి తెలిసిందే.