
'అది బీజేపీ విధానం కాదు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా విమర్శించారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పొరుగు దేశంతో సంబంధాల పునరుద్ధరణకు చేపట్టనున్న చర్చలు రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తో వ్యూహాత్మక చర్చలను తాను మొదట నుంచి వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని అన్నారు. భారత్- పాకిస్థాన్ కార్యదర్శుల స్థాయి చర్చలు వచ్చే వారం జరగనున్నాయి.
'యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పులనే తమ సర్కారు చేసింది. ఇది బీజేపీ విధానం కాదు. పాకిస్థాన్ తో ఎటువంటి చర్చలకు మనం సానుకూలం కాదు. దాయాది దేశంతో చర్చలు రద్దుచేసుకోవాలి' అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. తమ దేశంలో కొనసాగుతున్న తీవ్రవాద తండాలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ చర్య తీసుకున్నప్పుడే ఆ దేశంతో చర్చలు జరపాలని వాజపేయి హయాంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.