సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సోమవారం కేంద్ర మంత్రులు రాజ్యసభలో సమాధానమిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై ఎంపీ ప్రశ్నకు గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్ధీబాయ్ చౌదరి వివరణనిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో ప్రతిపాదనలు సమర్పించినట్టు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కోసం కొన్ని బ్లాక్‌లను కేటాయించాల్సిందిగా నాల్కో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలను సమర్పించిందని చెప్పారు. బాక్సైట్ గనుల కేటాయింపు జరిగితే విశాఖపట్నంలో అల్యూమినా రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమని నాల్కో తన ప్రతిపాదనలలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.
విశాఖ ఏజెన్సీలోని గూడెం, జెర్రలలోని బాక్సైట్ బ్లాక్‌లతోపాటు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కాటంరాజు కొండ వద్ద గల బాక్సైట్ బ్లాక్‌లను తవ్వకాల కోసం లీజుకు కేటాయించాల్సిందిగా 2007 నవంబర్‌లోనే నాల్కో దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ఆయా బాక్సైట్ బ్లాక్‌లలో తవ్వకాలు జరిపేందుకు 2009 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నాల్కోకు అనుమతించినట్లు మంత్రి తెలిపారు. కారణాంతరాల వలన నాల్కో బాక్సైట్ తవ్వకాలను చేపట్టలేకపోయిందని పేర్కొన్నారు. దీంతో తిరిగి ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సైట్ బ్లాక్‌లలో మైనింగ్ లీజు కోసం నాల్కో 2017 మే, 2017 సెప్టెంబర్ మాసాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. సుప్రీం కోర్టు (సమతా తీర్పులో) ఆదేశాల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీనంలోని సంస్థ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. నాల్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున షెడ్యూల్డు ఏరియాలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అర్హత కలిగి ఉందని ఆయన వెల్లడించారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులపై ఆంక్షలు లేవు
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీ, పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంక్‌లు ఉన్నందున రక్షణ శాఖ విమానాల్లో పైలట్ల శిక్షణకు ఇది ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వెల్లడించారు. విశాఖపట్నంలో ప్రాథమికమైన ఫ్లైయింగ్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోమని తెలిపారు. సుశిక్షితులైన పైలట్లే ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి మిలటరీ విమానాలను ఆపరేట్ చేస్తారని చెప్పారు. మిలటరీ విమానాల రాకపోకలకు సంబంధించి అవసరమైన అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామని వెల్లడించారు. ఆయిల్ రిఫైనరీలు, ట్యాంక్‌లపై నుంచి మిలటరీ విమానాలు రాకపోకలు సాగించవని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment