ఇంటర్నెట్‌ను కార్పొరేట్లకు పంచేస్తున్నారు | Centre wants to give away Internet to corporates: Rahul | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ను కార్పొరేట్లకు పంచేస్తున్నారు

Published Thu, Apr 23 2015 2:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇంటర్నెట్‌ను కార్పొరేట్లకు పంచేస్తున్నారు - Sakshi

ఇంటర్నెట్‌ను కార్పొరేట్లకు పంచేస్తున్నారు

న్యూఢిల్లీ: రైతుల సమస్యలపై లోక్‌సభలో గళమెత్తిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తాజాగా బుధవారం ఇంటర్నెట్ సమానత్వం అంశాన్ని ప్రస్తావించారు. లోక్‌సభ జీరో అవర్‌లో  ఇంటర్‌నెట్ సమానత్వం అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం ఇంటర్నెట్‌ను కొన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు, ఆ సంస్థలకు పంచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. యువత మొత్తానికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్నారు. ఇందుకోసం ప్రస్తుత చట్టాలను సవరించటమో, కొత్త చట్టం చేయటమో చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షం ఈ నిందలు వేస్తోందని ప్రభుత్వం తోసిపుచ్చింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.  

నోటీసు ఇచ్చి.. సభలో లేని రాహుల్...

అంతకుముందు.. ఇంటర్నెట్ సమానత్వ అంశంపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేయాలని రాహుల్ నోటీసు ఇచ్చారు. అయితే.. ప్రశ్నోత్తరాలు మొదలయినపుడు ఆయన సభలో లేరు. దీంతో.. ఆయన ఇచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకోవటం సాధ్యం కాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆ తర్వాత జీరో అవర్‌లో రాహుల్ ఇంటర్నెట్ సమానత్వం అంశాన్ని లేవనెత్తారు.
 
కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం...


ఇంటర్నెట్ సమానత్వంపై రాహుల్ ఆరోపణలకు ఐటీ, టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ సమాధానం ఇస్తూ.. ఈ అంశంపై ఈ ఏడాది జనవరిలో ఒక కమిటీని ఏర్పాటు చేశానని, ఆ కమిటీ నివేదిక మే నెలలో అందుతుందని.. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసునన్నారు. ‘బొగ్గు గనుల కేటాయింపుల్లో ఏం జరిగింది? 2012 ఆగస్టులో ట్వీటర్ వెబ్‌సైట్‌పై ఆంక్షలు విధించిందెవరు? దీనిపై పార్లమెంట్‌లో ఒక రోజు చర్చ జరగాల్సి రావచ్చు’ అని విమర్శించారు. ఆయన విమర్శలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయబోయారు. వారికి అనుమతి ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఒక ప్రశ్న అడగటానికి పది సెకన్ల సమయం కావాలని స్పీకర్‌కు రాహుల్ విజ్ఞప్తి చేశారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కోరారు. జీరో అవర్‌లో ప్రశ్నోత్తరాలకు నిబంధనలు అనుమతించవని స్పీకర్ అన్నారు.  

నెట్ సమానత్వంపై చర్చ.. సర్కారు పరీక్ష

ఇంటర్నెట్ సమానత్వంపై పార్లమెంట్‌లో చర్చ నేపథ్యంలో.. ఇంటర్నెట్ అనేది ఎటువంటి వివక్షకూ తావులేకుండా అందరికీ సమానంగా అందుబాటులో ఉండటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని  మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆ తర్వాత మీడియాతో పేర్కొన్నారు. రాహుల్ సైతం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్నెట్ సమానత్వంపై చర్చ.. ప్రభుత్వం ఇంటర్నెట్‌ను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా ప్రజా ప్రతిస్పందనను తెలుసుకునేందుకు ఉద్దేశించిన పరీక్ష అని అభివర్ణించారు. నెట్ సమానత్వానికి కట్టుబడి ఉన్నట్లయితే అసలు దానిపై సంప్రదింపుల ప్రక్రియ ఎందుకు ప్రారంభించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

గోర్బచేవ్‌కే అంత గౌరవం దక్కింది...

ప్రధాని నరేంద్రమోదీ గురించి అమెరికా అధ్యక్షుడు ఒబామా టైమ్ మేగజీన్‌లో రాసిన వ్యాసాన్ని వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ రాహుల్ లోక్‌సభలో ప్రసంగం ప్రారంభించారు. ‘మోదీని పొగుడుతూ ఒబామా చాలా సుదీర్ఘ వ్యాసం రాశారు. తొలిసారి ఒక అమెరికా అధ్యక్షుడు ఒక భారత ప్రధాని గురించి ఇంతగా పొగిడారు. ఒబామా ఏమీ చిన్న వ్యక్తి కాదు.  అమెరికా అధ్యక్షుడు. ఇంతకుముందు.. కేవలం గోర్బచేవ్ మీద మాత్రమే ఇలాంటి ప్రశంసలు చూపించారు. ఎందుకంటే.. ఆయన అమెరికాకు సాయం చేశారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
 
వివాదం ఏంటి..?

ప్రోడక్టు డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా కొన్ని టెలికాం కంపెనీలు(టెల్కోలు) ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా యాప్స్, సైట్స్‌కి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అయితే, ఒకే స్పీడుతో అన్ని యాప్స్‌ను, సైట్స్‌ను అందిస్తూ, నెట్ విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల ఇతర సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చెల్లించే స్తోమత ఉండని స్టార్టప్స్ పరిస్థితి ఏంటన్న సందేహాలు నెలకొన్నాయి. ఎయిర్‌టెల్ జీరో పేరిట కొత్తగా డేటా ప్లాన్ ప్రవేశపెట్టిన టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌పైనా, ఇంటర్నెట్ డాట్‌ఆర్గ్ ప్రారంభించిన ఫేస్‌బుక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా విమర్శలు వచ్చాయి.  ఈ నేపథ్యంలోనే చిన్న సంస్థలు దీనికి వ్యతిరేకంగా గొంతెత్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement