
ప్రచారమే పరమావధిగా.. చంద్రబాబు
‘అందరితో చర్చించి రాష్ట్రాన్ని విభజించండి’ అనే డిమాండ్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారానికి రెండో రోజుకు చేరింది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘అందరితో చర్చించి రాష్ట్రాన్ని విభజించండి’ అనే డిమాండ్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారానికి రెండో రోజుకు చేరింది. సోమవారం జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయాన్నే పత్రికలు చదివిన బాబు, తొలి రోజు దీక్షకు తగిన ప్రాధాన్యత రాలేదని, ఒకట్రెండు అనుకూల పత్రికలు మినహా మిగతా వాటన్నింట్లోనూవ్యతిరేక వార్తలే వచ్చాయని సన్నిహితుల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో నష్ట నివారణ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.
ఈ బా ధ్యతను కుమారుడు నారా లోకేశ్‌తో పాటు కోటరీలో కీలకులైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, సీఎం రమేశ్, సుజనా చౌదరిలకు బాబు అప్పగించారు. వారు జాతీయ స్థాయిలో తమకు మిత్రపక్షాల నేతలు సందర్శిస్తేనే మేలని నిర్ధారణకు వచ్చారు. ఆ మేరకు ఎంపిక చేసుకున్న పార్టీల నేతలను సంప్రదించారు. దాంతో పాంథ ర్స్ పార్టీ అధ్యక్షుడు భీమ్‌సింగ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నాయకుడు అజయ్‌సింగ్ చౌతాలా, ఆ పార్టీ ఎమ్మెల్యులు, శిరోమణి అకాలీదళ్ ఎంపీ, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారుడు నరేశ్ గుజ్రాల్, మాజీ ఎంపీ త్రిలోచన్‌సింగ్ తదితరులు శిబిరాన్ని సందర్శించారు. జాతీయ స్థాయిలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే యోచనలో బాబు ఉన్న నేపథ్యంలో మంగళవారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వారే ఎక్కువగా ఉన్నారు.
సాయంత్రం ఐదింటికి బాబు మీడియాతో మాట్లాడతారని తొలుత టీడీపీ మీడియా కమిటీ సమాచారం పంపింది. కానీ తెలంగాణపై మళ్లీ మీడియా నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుందనే ఉద్దేశంతో, ‘దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారినుద్దేశించి బాబు ప్రసంగిస్తారు’ అంటూ ఆ తర్వాత సమాచారం పంపారు. సందర్శకులు లేక బాబు శిబిరం వెలవెలబోతున్న వేళ ఎల్‌ఐసీ ఏజెంట్లు ఆదుకున్నారు. మంగళవారం నగరంలోని త్యాగరాజ స్పోర్స్ట్ కాంప్లెక్స్ చైర్మన్ క్లబ్‌లో జరిగిన ఎల్‌ఐసీ ఏజెంట్ల భేటీకి ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఏజెంట్లు భారీగా కుటంబసభ్యులతో పాటు హాజరయ్యారు. దాంతో టీడీపీ ముఖ్యుల ప్రతినిధులు వచ్చి, ‘రాష్ట్రం కోసం చంద్రబాబు ఏపీభవన్‌లో దీక్ష చేస్తున్నారు, ఆయన్ను పరామర్శించండి’ అని కోరారు. దగ్గరుండి ఎల్‌ఐసీ ఏజెంట్లను దీక్ష వద్దకు తరలించారు. రవాణా బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ తీసుకుంది. అయితే వారిని తీసుకొచ్చిన చోటే తిరిగి వదిలిపెట్టింది. టెంట్లు వెళ్లిపోవడంతోనే శిబిరంలో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. దాంతో ఢిల్లీలోని రాష్ట్రవాసులను తరలించారు.
శిబిరం తొలగించాలని నోటీసు
అనుమతి లేకుండా నిరవధిక దీక్ష చేస్తున్నందున దీక్షా శిబిరాన్ని వెంటనే తొలగించాలంటూ చంద్రబాబుకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. నోటీసు కాపీని స్థానిక పోలీసులకు కూడా అందజేశారు. పోలీసులు కూడా శిబిరాన్ని తొలగించేందుకు సాయంత్రం ఐదింటి సమయంలో వచ్చారు. లోకేశ్ తదితరులు వారితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తరవాత ఢిల్లీ పోలీసు అధికారులను కూడా వారు కలిశారు. మంగళవారం శిబిరాన్ని తొలగించబోమని హామీ వచ్చినట్టు అనంతరం నేతలు విలేకరులకు చెప్పారు.
అఖిలపక్షం వేయాలి: బాబు
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించేందు కు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల జేఏసీలను, భాగస్వాములను పిలిచి చర్చించాలన్నారు. రాష్ట్ర సమస్యను కేంద్రం పరిష్కరించేదాకా తాను ఢిల్లీ వీడేది లేదని, ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఏపీ భవన్‌లో నిరవధిక దీక్ష వేదిక నుంచి బాబు ప్రసంగించారు. విభజన నిర్ణయంతో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని తాను దీక్ష చేస్తుంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ రెచ్చగొట్టేలా వ్యవహరించటం సరికాదన్నారు.
కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు సమర్పించిన లేఖలను ఆయన విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. షరామామూలుగా విభజనపై తన వైఖరేమిటో బాబు తన ప్రసంగంలో ఎక్కడా స్పష్టం చేయలేదు. టీడీపీని దెబ్బ తీసేందుకు విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌లతో మ్యాచ్‌ఫిక్సిం గ్ చేసుకుందని ఆరోపణలను మరోసారి విన్పించారు. సోనియా తన కుమారుడు రాహుల్‌ని ప్రధాని చేసేందుకు రాష్ర్ట విభజన చేస్తుంటే, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన కుమారుడిని సీఎంచేసేందుకు సోనియాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం చైర్మన్ మురళీకృష్ణ, సభ్యులు బాబును కలిసి సంఘీభావం తెలిపారు.