
చిన్నారి హత్య: మహిళ అరెస్ట్
వేలూరు: వివాహేతర సంబంధం ప్రియుడి భార్యకు తెలిసిపోవడంతో కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకుని ఓ మహిళ హత్య చేసింది. ఈ సంఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం ప్రాంతానికి చెందిన మురళి. ఇతనికి ముగ్గురు పిల్లలున్నారు. రెండవ కుమారుడు దినేష్(3) శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆటలాడుతూ కనిపించకపోవడంతో వేలూరు నార్త్ పోలీసులకు మురళి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముత్తుమండపం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసులను చూసిన వెంటనే మురళి ఇంటి ముందు నివశిస్తున్న పెయింటర్ ప్రభు భార్య సుమతి ఇంటికి తాళం వేసి బయట వచ్చి కూర్చుంది. అనుమానించిన పోలీసులు సుమతి వద్ద విచారణ జరపగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పింది.
అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిలో గాలించారు. బీరువాను పగలగొట్టి చూడగా అందులో చిన్నారి నోటిలో గుడ్డలు పెట్టి కాళ్లు,చేతులు కట్టి ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు సుమతిని అరెస్ట్ చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసుల విచారణలో చిన్నారి తండ్రి మురళీకి, తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. ఈ విషయం మురళి భార్యకు తెలిసి పోవడంతో ఆమె తనతో ఇటీవల ఘర్షణ పడిందని పోలీసులకు చెప్పింది. ఆమె మీద కక్ష తీర్చుకోవడం కోసం వీధిలో ఆటలాడుకుంటున్న దినేష్‌ను ఇంటిలోకి తీసుకెళ్లి నోటిలో గుడ్డ పెట్టి కాళ్లు, చేతులు కట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశానని, ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని బీరువాలో పెట్టినట్లు నేరాన్ని అంగీకరించింది. కేసు దర్యాప్తులో ఉంది.