
ఇటానగర్: సుమారు 50 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ కల్పించే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ను ప్రభుత్వం దీక్షగా చేపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన ఈ పథకంతో ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వస్తాయన్నారు. మోదీ గురువారం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో టోమో రీబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ భవనానికి శంకుస్థాపన చేశాక నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిమితిలో ఆరోగ్య రక్షణ కల్పించే వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టేందుకు ఇదే తగిన సమయం’ అని అన్నారు.
అరుణాచల్ పర్యటనపై చైనా నిరసన
ప్రధాని మోదీ అరుణాచల్‌లో పర్యటించడాన్ని చైనా తప్పు పట్టింది. ఆ భూభాగం తమ అధీనంలోని దక్షిణ టిబెట్‌లో భాగమని పునరుద్ఘాటించింది. సరిహద్దు వివాదాన్ని సంక్లిష్టం చేసేలా వ్యవహరించొద్దని భారత్‌కు సూచించింది. మోదీ పర్యటనపై భారత్‌కు దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలుపుతామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి షువాంగ్ చెప్పారు. సరిహద్దు సమస్యలపై చైనా వైఖరి స్పష్టంగా ఉందన్నారు.