బీజింగ్ : భారత్ - చైనాల మధ్య మరో భారీ పోరాటం ఆరంభం కాబోతోంది. నిన్నటివరకూ భారత్‌తో భూమి(డోక్లాం) కోసం పోరాడిన చైనా.. ఇక నుంచి నీటి పోరుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. షిన్‌జియాంగ్ చైనా భూభాగంలోని ఎడారి ప్రాంతం. ప్రస్తుతం దీన్ని చైనా సస్యశ్యామలం చేయాలనుకుంటోంది. అది పొరుగు దేశాల పొట్టకొట్టి. డ్రాగన్ కన్ను మన ‘బ్రహ్మపుత్ర’పై పడింది. చైనాలో బ్రహ్మపుత్రను యార్లుంగ్ త్సాంగ్‌పోగా పిలుస్తారు. వాస్తవానికి షిన్‌జియాంగ్ ఉన్న ప్రాంతానికి బ్రహ్మపుత్ర 1,000 కిలోమీటర్లు దూరంలో ఉంది.
మరి ఎలా?. ఇందుకు చైనా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను ఈ దిశగా ఆలోచించి మార్గం చూపాలని కోరింది. ఒక్క నెలలోనే అదిరిపోయే ప్లాన్‌తో వచ్చారు సైంటిస్టులు. శాస్త్రవేత్తలు వేసిన ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే. షిన్‌జియాంగ్ నుంచి వెయ్యి కిలోమీటర్లు పాటు సొరంగం తవ్వి నీటిని తరలిద్దామనేది ఆ ప్రతిపాదన. ఈ నిర్మాణం జరిగితే ప్రపంచంలోనే అతి పెద్ద జల సొరంగంగా ప్రఖ్యాతి చెందుతుంది.
సొరంగం తవ్వడానికి కావల్సిన బ్లూ ప్రింట్‌ను తయారు చేయాలని శాస్త్రవేత్తలను చైనా ఆదేశించింది. ప్రస్తుతం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో నిమజ్ఞమయ్యారు పరిశోధకులు. అయితే ఈ ప్రాజెక్టు అంత సులువేమీ కాదు. ప్రస్తుతం ప్రపంచంలో అతి పొడవైన జల సొరంగం న్యూయార్క్‌లో ఉంది. దీని పొడవు కేవలం 137 కిలోమీటర్లే.
మరుభూమిగా ఈశాన్య భారత్..
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఈశాన్య భారత్, బంగ్లాదేశ్‌లు మరుభూమిగా మారతాయి. ఇది ముందే తెలిసిన శాస్త్రవేత్తలు విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. బయటకు వచ్చి అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు.
భారీ డ్యామ్‌ను కనుక నిర్మించ తలపెడితే ఎన్విరాన్‌మెంటలిస్టులు, పొరుగు దేశాలు చైనాకు వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభిస్తాయి. అంతర్జాతీయ ఒత్తిడిల నుంచి తప్పించుకునేందుకే సొరంగ నిర్మాణ వ్యూహాన్ని చైనా భూజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది.
షిన్‌జియాంగ్ సస్యశ్యామలం..
త్సాంగ్‌పో(బ్రహ్మపుత్ర) నీటిని చైనా తరలిస్తే.. ఈశాన్య భారత్ నడ్డివిరిచినట్లవుతుంది. టిబెట్ పీఠభూమిలో చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల దిగువన బ్రహ్మపుత్రా నీటి ప్రవాహం తగ్గిపోతోందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎడారులతో కూడిన కరవు ప్రాంతమైన షిన్‌జియాంగ్ దాహార్తిని తీర్చేందుకు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుంచి నీటి మళ్లింపును చైనా చేపట్టింది.
బ్రహ్మపుత్ర జలాలను భారీగా తలించటం ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్నది తమ లక్ష్యమని ప్రాజెక్టు రూపకల్పనలో కీలకపాత్ర వహిస్తున్న ఇంజినీర్ ఒకరు తెలిపినట్లు హాంకాంగ్ నుంచి వెలువడే ‘సౌత్‌చైనా మార్నింగ్‌పోస్ట్’ పేర్కొంది. వివిధ రంగాలకు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు ఈ భారీ ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. యునాన్ ప్రావిన్స్‌లో 600 కి.మీ. సొరంగం నిర్మాణాన్ని చైనా ఆగస్టులో ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment