న్యూఢిల్లీ: సుదీర్ఘమైన చర్చలు, తీవ్ర నిరసనలు, వాదోపవాదాలు, సవరణలకు డిమాండ్ల మధ్య పౌరసత్వ సవరణ బిల్లుకి 311–80 ఓట్ల తేడాతో లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది కానీ, పెద్దల సభలో ఏం జరుగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
పొరుగు దేశాల్లో ఉన్న ముస్లిమేతరులకు భారత్ పౌరసత్వాన్నిచ్చే పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) బుధవారం ఎగువ సభలో ప్రవేశపెడుతున్నట్టు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లుపై చర్చకు 6 గంటలు కేటాయించినట్టు తెలుస్తోంది.
బిల్లుపై సందేహాలు తీర్చాలి: ఉద్ధవ్ ఠాక్రే
హిందూత్వ పార్టీ శివసేన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లోక్‌సభలో బిల్లుకి మద్దతు తెలిపినప్పటికీ మంగళవారం యూ టర్న్ తీసుకుంది. బిల్లుపై నెలకొన్న సందేహాలను తీర్చనట్లయితే రాజ్యసభలో మద్దతివ్వబోమని పార్టీ అ«ధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ తమకు మద్దతు పలికేవారిని దేశభక్తులని, వ్యతిరేకించే వారందరినీ దేశద్రోహులని ముద్ర వేస్తోందని ధ్వజమెత్తారు.
ఠాక్రే వ్యాఖ్యల్ని స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పౌరసత్వ సవరణ బిల్లు పాసయితే రాజ్యాంగంపైన దాడి జరిగినట్లేనని వ్యాఖ్యానించారు. మరోవైపు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల్లోని ముస్లింలలో తీవ్ర అభద్రత నెలకొంటుందని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఈ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింల పట్ల ఈ బిల్లు వివక్ష చూపుతోందన్నారు. అయినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతివ్వాలని జేడీ(యూ) నిర్ణయించింది.
బీజేపీ అంచనాలివి
రాజ్యసభలో అధికార బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే బిల్లును గట్టెక్కించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యూహాలు పన్నుతున్నారు. బిల్లుకు అనుకూలంగా కనీసం 124–130 ఓట్లు వస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. విపక్షాల బలం 90–93కి పరిమితమైపోతుందని అంచనా వేస్తోంది.
ఇన్నాళ్లూ ఎన్టీయే ప్రభుత్వం పెట్టిన ప్రతీ బిల్లుకి టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ ఈ సారి మైనారిటీ ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నదని పేర్కొంటూ ఈ బిల్లుకి లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్ మద్దతివ్వలేదు.
ఈశాన్య రాష్ట్రాల బంద్ సక్సెస్
ముస్లిం మైనారిటీల ప్రయోజనాలను కాలరాసేలా ఉందంటూ పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం చేపట్టిన బంద్ సక్సెస్ అయింది. లెఫ్ట్ పార్టీలు, ఇతర ప్రజాస్వామ్య సంస్థలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌తో అసోంలో జనజీవనం స్తంభించింది.
పెద్దల సభలో ఎవరు ఎటు వైపు ?
మొత్తం సభ్యుల సంఖ్య: 245
ప్రస్తుతం ఉన్న సభ్యులు: 240
మేజిక్ ఫిగర్: 121
బిల్లుకి అనుకూలం 115
బీజేపీ (83), ఏఐఏడీఎంకే (11), జేడీయూ (6), శిరోమణి అకాలీదళ్ (3), స్వతంత్ర, నామినేటెడ్ అభ్యర్థులు (7), ఒక్కో సభ్యుడు ఉన్న చిన్న పార్టీలు (5)
ఎన్డీయేతర పక్షాలు బిల్లుకి అనుకూలం 11
బీజేడీ (7), వైసీపీ (2), టీడీపీ (2),
మొత్తం: 115 + 11 = 126
బిల్లుకి వ్యతిరేకం 95
కాంగ్రెస్ (46), తృణమూల్ కాంగ్రెస్ (13), సమాజ్‌వాదీ పార్టీ (9), లెఫ్ట్ పార్టీలు (6), టీఆర్‌ఎస్ (6), ఎన్సీపీ (4), బీఎస్పీ (4),
ఆర్‌జేడీ (4), ఆప్ (3), మొత్తం: 95
►ఇవి కాకుండా ముగ్గురు సభ్యులున్న శివసేన, ఒక్కో సభ్యుడున్న చిన్న పార్టీల మద్దతుతో విపక్షాల సంఖ్య 100 వరకు చేరుకోవచ్చునని ఓ అంచనా
అమిత్ షాపై ఆంక్షలు విధించాలి
పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) తప్పు పట్టింది. ఈ బిల్లు తప్పుడు మార్గంలో వెళుతూ అత్యంత ప్రమాదకరంగా మారిందని వ్యాఖ్యానించింది. భారత లౌకికతత్వాన్ని ఈ బిల్లు దెబ్బ తీస్తోందని, సమాన హక్కుల్ని కాలరాస్తోందని పేర్కొంది.
మత ప్రాతిపదికన చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న హోం మంత్రి అమిత్, ఇతర నాయకులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణించాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది.
ఎదురుదాడికి దిగిన భారత్
అమెరికా కమిషన్‌పై భారత్ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ బిల్లుపై కనీస అవగాహన లేకుండా ఆ కమిషన్ సూచనలు చేస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఈ అంశంలో ఆ సంస్థ ఈర్ష్య, పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఎదురు దాడికి దిగారు.
ఆంక్షలు విధించాలంటూ సిఫార్సులు చేయడం అత్యంత విచారకరమన్న రవీష్ కుమార్ భారత్‌లో చట్టాలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఆ సంస్థకు లేదని అన్నారు. గోద్రా ఘర్షణల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి టూరిస్ట్ వీసా నిరాకరణకు యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ మద్దతునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment