ఉగ్ర కుట్ర భగ్నం | Condemning Uri terror attack, France, Russia score direct hits against Pakistan | Sakshi
Sakshi News home page

ఉగ్ర కుట్ర భగ్నం

Published Wed, Sep 21 2016 1:16 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

ఉగ్ర కుట్ర భగ్నం - Sakshi

ఉగ్ర కుట్ర భగ్నం

* ఉడీలో చొరబాటుకు పాక్ యత్నం  
* తిప్పికొట్టిన సైన్యం  
* పదిమంది ముష్కరుల హతం

ఉడీ/న్యూఢిల్లీ: రెండ్రోజుల క్రితం ఉడీలో ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిని మరువకముందే.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీగా చొరబాట్లకు ప్రయత్నించారు. దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. చొరబాటుకు యత్నించిన 15 మందిలో 10 మంది మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఈ ఘటనలో ఓ జవాన్ అమరుడయ్యాడు. ఉడీ సెక్టార్‌లో సరిహద్దు పక్కనే ఉన్న దట్టమైన అడవిలో నక్కి.. బలగాలపై కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.

రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 15 మంది మిలిటెంట్లు ఎల్వోసీ గుండా చొరబాటుకు యత్నించారని.. ఢిల్లీలోని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అటు పాకిస్తాన్ మరోసారి ఎల్వోసీ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత సరిహద్దు పోస్టులపై ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. దీనికి కూడా భారత దళాలు దీటైన జవాబిచ్చాయి.   
 
ఇంకా కోలుకోకముందే..
ఆదివారం నాటి దుర్ఘటన నుంచి భారత ఆర్మీ కోలుకోకముందే.. దెబ్బమీద దెబ్బ కొట్టాలని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భావించారు. దీంతో బారాముల్లా (ఉడీ)తోపాటు కొండ ప్రాంతమైన కుప్వారా (నౌగామ్) జిలాల్లో చొరబాట్లకు ప్రయత్నించారు. మంగళవారం మధ్యాహ్నం దాదాపు 15 మంది మిలిటెంట్లు పెద్దసంఖ్యలో ఆయుధాలతో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా.. భారత దళాలు తిప్పికొట్టాయి. తోటి జవాన్లు అమరులయ్యారన్న బాధతో కూడిన కసితో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉడీ ప్రాంతంలో ఎల్వోసీకి పక్కనే దట్టమైన అడవి ఉంది.

ఇక్కడ జవాన్లు, మిలిటెంట్ల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. మరికొంత మంది మిలిటెంట్లు ఇక్కడ నక్కి ఉండొచ్చని భావిస్తున్న జవాన్లు.. అడవంతా జల్లెడపడుతున్నారు. ఆదివారం నాటి ఘటనకు ముందూ ఇక్కడి నుంచే చొరబాట్లు జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సెప్టెంబర్ 11, 16 తేదీల్లోనూ భారీ చొరబాట్ల యత్నాన్ని జవాన్లు తిప్పికొట్టారు.
 
బరితెగించిన పాక్..
ఉడీ ఘటనతో పాకిస్తాన్‌పై ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన ఒత్తిడి పెరుగుతుండటంతో.. ఆత్మరక్షణలో పడ్డ పాకిస్తాన్ సరిహద్దులో భారత ఔట్‌పోస్టులపై కాల్పులకు తెగబడింది. మంగళవారం మధ్యాహ్నం 1.10-1.30 గంటల సమయంలో ఎల్వోసీ వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడిందని శ్రీనగర్‌లోని ఆర్మీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటనలో నష్టమేమీ జరగలేదని.. భారత బలగాలు వీటిని తిప్పికొట్టాయని వెల్లడించింది. ఉగ్రవాదుల చొరబాట్ల నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్  సైన్యం కాల్పులు జరిపిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఉడీ ఘటనకు పాకిస్తాన్తో సంబంధం లేదని అక్కడి ప్రభుత్వం చెబుతుండగా.. పాక్ మద్దతుతోనే దాడులు జరిగాయనటానికి ఆధారాలను భారత్ సేకరిస్తోంది. ఉగ్రవాదుల వద్ద లభించిన వాకీటాకీలు పాక్ ఆర్మీ వాడుతున్నవిగా గుర్తించింది.
 
రాజ్‌నాథ్ సమీక్ష.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఎన్‌ఎస్‌ఏ చీఫ్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్‌తోపాటు పలువురు హోం, రక్షణ రంగ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి విదేశాంగ కార్యదర్శి రావటం చూస్తుంటే.. దౌత్యపరంగా కూడా పాక్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా, పలు అంశాలపై విచారణ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ మద్దతుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకుంటామని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మరోవైపు ఉడీ దుర్ఘటనపై పాకిస్తాన్‌కు సరైన సమాధానం ఎలా ఇవ్వాలనే అంశంపై చర్చించేందకు బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది.
 
హెచ్చరికలకు బెదరం: పాకిస్తాన్
ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత్ చేస్తున్న బెదిరింపులకు జడిసే ప్రసక్తే లేదని పాక్ పేర్కొంది. కశ్మీరీల పోరాటానికి తమ మద్దతుంటుందని పాక్ హోం మంత్రి నిసార్ అలీ ఖాన్ తెలిపారు. ‘కశ్మీరీలది న్యాయపోరాటం. వారి ఆత్మాభిమానాన్ని తొక్కిపెట్టలేరు. వీరికి రాజకీయంగా, దౌత్యపరంగా మా పూర్తి మద్దతు అందిస్తాం. కశ్మీర్‌లో భారత్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది’ అని పేర్కొన్నారు.
 
పాక్‌కు చీవాట్లు
ఉడీ ఘటనతో పాక్‌ను ఏకాకిని చేయాలన్న భారత యత్నాలకు సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఐరాస భద్రతామండలి శాశ్వత సభ్యదేశాలైన రష్యా, ఫ్రాన్స్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనల్లో పాక్ పేరును ప్రస్తావిస్తూ నేరుగా విమర్శించాయి. పాక్, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలన్నాయి. భారత్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని.. భారత్‌కు తమ మద్దతుంటుందని అమెరికా, బ్రిటన్ అన్నాయి.  చైనా మాత్రం ఉడీ ఘటనను ఖండిస్తున్నామని ముక్తసరి ప్రకటన చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement